సావిత్రిబాయి పూలే పోరాటం, త్యాగాలు మరువలేనివి
కలెక్టర్ పమేలా సత్పతి
ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
కరీంనగర్ (విజయక్రాంతి): విద్యతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమని నమ్మి.. దేశంలో బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సావిత్రీబాయి పూలే జయంతి పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయి (స్థానిక సంస్థలు), లక్ష్మీ కిరణ్ (రెవెన్యూ), ఇన్ చార్జి డీఆర్ఓ పవన్ కుమార్, ఆర్డిఓ మహేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అజ్ఞానమే మన శత్రువు అని విద్యావంతులుగా మారి ఆ శత్రువును తుద ముట్టించాలన్న పూలే ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ రోజుల్లోనే స్త్రీలను చైతన్యపరిచి కుల వ్యవస్థ, బాల్యవివాహాలు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. ఆమె చేసిన పోరాటం, త్యాగాలతోనే ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని వివరించారు. డీఈవో జనార్దన్ రావు మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సుధాకర్ రెడ్డి, వివిధ శాఖల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.