calender_icon.png 22 April, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం నిధులతోనే హైదరాబాద్‌లో అభివృద్ధి

22-04-2025 12:11:46 AM

50 ఏళ్ల కింద కట్టుకున్న ఇండ్లను 

వక్ఫ్ ఆస్తి కింద కలుపుకున్నారు

ఓటుహక్కును నిరాకరించడం అప్రజాస్వామికం

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ఈటల

హైదరాబాద్,(విజయక్రాంతి): మోదీ ప్రధాని కాకముందు దేశవ్యాప్తంగా బాంబులుపెట్టి ఎంతోమంది ప్రాణాలు తీశారో కార్పొరేటర్లు గుర్తుతెచ్చుకోవాలని.. హైదరాబాద్ ప్రశాంతంగా, రక్తం చిందకుండా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. హైదరాబాద్ అభివృద్ధి స్థానిక ప్రభుత్వాల ఘనత కాదని, నిధులు ఇచ్చిన కేంద్రం ఘనతగా అభివర్ణించారు. బీఆర్‌ఎస్ పార్టీ తమ కార్పొరేటర్లను ఓటింగ్‌లో పాల్గొనద్దంటూ అనైతిక పిలుపునివ్వడం దుర్మార్గమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.5 వేల కోట్ల డిపాజిట్‌తో ఉన్న జీహెచ్‌ఎంసీ.. నేడు రూ.7 వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని దుస్థితిలో జీహెచ్‌ఎంసీ ఉందని వాపోయారు. కార్పొరేషన్ వద్ద కనీసం మురికి కాలువలు బాగుచేయించడానికి కూడా పైసలు లేవన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకరికొకరు ప్రతిపక్షం అని చెప్పుకుంటారని.. కానీ బీజేపీ వేగాన్ని తట్టుకోలేక మీదికి కొట్టుకుంటూ, లోపల కలిసి ఉన్నారని ఆరోపించారు. బెంగాల్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. హైదరాబాద్‌లో వక్ఫ్ పేరిట వేల కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయన్నారు. కార్పొరేటర్లారా చూస్తూ చూస్తు మోసపోవద్దు.. మీ ఓటు వృథా చేయవద్దు అని ఈటల సూచించారు. రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని తప్పుడు మాటలు మాట్లాడొద్దని, పదేళ్ల పాలనలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది, బీఆర్‌ఎస్ సర్కారు ఏం చేసిందనే దానిపై అబిడ్స్ చౌరస్తాలో చర్చకు వస్తారా అని కేటీఆర్‌కు సవాలు విసిరారు. రాష్ర్టంలో కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ఆరోపించారు.