calender_icon.png 7 January, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో అభివృద్ధి పట్టాలు తప్పింది

06-01-2025 01:42:13 AM

  • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి
  • అభివృద్ధిపై ఆప్ ప్రభుత్వానికి విజన్ లేదు
  • బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ఆప్‌పై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ
  • ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదని కేజ్రీవాల్ కౌంటర్

న్యూఢిల్లీ, జనవరి 5: ఆమ్ ఆద్మీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ అభివృద్ధి పట్టాలు తప్పిందని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఆరో పించారు. ఢిల్లీని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేసే సత్తా బీజేపీకే ఉందని ప్రధాని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. రోహిణిలోని జపనీస్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ పరివర్తన్ ర్యాలీలో పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించబోతున్నట్టు జోస్యం చెప్పారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి విషయంలో తమ నిబద్ధతను చూసి ప్రజలు బీజేపీని నమ్మడం మొదలు పెట్టారన్నారు. ఆప్ పాలనలో గత పదేళ్లలో దేశ రాజధాని ప్రజలు సంక్షోభాన్ని చూశారన్నారు. ఈ సంక్షోభాన్ని ఢిల్లీ ప్రజలు సహించడం లేదని, మంచి మార్పును కోరుకుంటున్నారని ప్రధా ని పేర్కొన్నారు.

అభివృద్ధిపై ఆప్ ప్రభుత్వానికి విజన్ లేదని ఆరోపించారు. అంతేకాకుండా ప్రజలకు వ్యతిరేకంగా ఆ పార్టీ పని చేస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీలో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే చేపడుతోందని తెలిపారు. నగరంలోని ప్రతి మూలకు మెట్రో సేవలను విస్తరించినట్టు చెప్పారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆప్ ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి అద్దాల మేడను నిర్మించిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీని ప్రజలు ఓడిస్తారనే విషయం ఆ పార్టీ నేతలకు అర్థమైందన్నారు. అందుకే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  

2020లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి

ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ ప్రజలను ప్రతిరోజూ అవమానిస్తున్నారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన విమర్శలను ఖండించారు. 2020లో ఢిల్లీలోని దేహాట్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నెరవేర్చాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 

ప్రధాని మోదీ చేసిన 38 నిమిషాల ప్రసంగంలో ఆప్ ప్రభుత్వాన్ని తిట్టడానికే 29 నిమిషాలు కేటాయించారని విమర్శించారు. ఆప్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఢిల్లీ అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీతో కలిసి పని చేస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీ నమో భారత్ కారిడార్‌ను ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ.. కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందన్నారు. కాగా, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.  

నమో భారత్ కారిడార్ ప్రారంభం

ఢిల్లీ నమో భారత్ కారిడార్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. దీంతో  నమో భారత్ కారిడార్ సేవలు మొత్తం 11 స్టేషన్లతో 55 కిలోమీటర్లకు విస్తరించాయి. అనంతరం ప్రధాని మోదీ యూపీఐ ద్వారా క్యూఆర్ టికెట్‌ను బుక్ చేసుకుని పాఠశాల విద్యార్థులతో కలిసి సాహిదాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ప్రయాణించారు.

కాగా ఈ మార్గంలో కొత్తగా ప్రారంభించిన రైలు 13 కిలోమీటర్ల విభాగంలో 6 కిలోమీటర్ల మేర భూగర్భంలో నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు. దీంతో నమో భారత్ రైళ్లు తొలిసారిగా భూగర్భ విభాగంలో నడవనున్నాయని పేర్కొన్నారు.