- ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
- స్వామి వారిని దర్శించుకొని, కోడె మొక్కులు చెల్లించుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సిరిసిల్ల, నవంబర్ 20 (విజయక్రాంతి): వేములవాడలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనుల జాతర చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రజాపాలన విజయోత్సవలో భాగంగా వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఆలయానికి వచ్చిన సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులతో స్వామివారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అద్దాల మండపంలో సీఎంరే స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ ప్రాంగణంలో రూ.679 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సాలను వర్చువల్‌గా ప్రారంభించారు.
అనంతరం గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రులతో కలిసి వెళ్లారు. మధ్యమానేరులో ముంపునకు గురైన గ్రామాల్లో రూ.236 కోట్లతో భూనిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. రూ.166 కోట్లతో సిరిసిల్లలోని వెంకటాపూర్ బైపాస్ వద్ద ప్రభుత్వ వైద్యశాల కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.
వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో రూ.50 కోట్లతో నూల్ డిపో ఏర్పాటు చేయగా, దానిని ప్రారంభించారు. రూ.47.85 కోట్లతో మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రుద్రంగిలో రూ.42 కోట్లతో ఆడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్ సముదాయం వెనుక భాగంలో గల జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం రూ.28 కోట్లతో నిర్మించగా, దానిని వర్చువల్‌గా ప్రారంభించారు. వేములవాడ పట్టణంలోని రూ.1.45 కోట్లతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనంతో పాటు రూ.4.80 కోట్లతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ను ప్రారంభించారు.
వేములవాడ పట్టణంలో మురుగు కాల్వ సమస్య పరిష్కారం కోసం రూ.3.80 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. వీర్నపల్లిలో రూ.కోటి తో పీహెచ్‌సీ నిర్మాణం, కాళేశ్వరం ప్యాకేజీ 9వ పనులకు రూ.11.79 కోట్లు నిధులను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.
ముందస్తు అరెస్ట్‌లు
వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందుస్తు అరెస్ట్‌లు చేపట్టారు. కొంత కాలంగా పెండింగ్ బిల్లులపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ సర్పంచ్‌లను ముందస్తుగా అరెస్ట్ చేసి, వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. కాగా తమ సమస్యలను రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, వినతి పత్రం ఇస్తామని.. అనుమతి ఇప్పియగలరనీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి విన్నవించుకున్నారు.
దీంతో మాజీ సర్పంచ్‌లను సీఎంను కలిసేందుకు పాసులు కూడా జారీచేశారు. ఎలాంటి నిరసనలు చేపట్టకుండా ఉన్న మాజీ సర్పంచ్‌లను వారి ఇండ్లలోనే మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఏబీవీపీ కార్యకర్తలను, బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు.
అన్నదాన సత్రానికి రూ.32.25 కోట్లతో పరిపాలన అనుమతులు
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదాన సత్రాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.32.25 కోట్లను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ పరిపాలన పరమైన అనుమతులు మంజూరుచేశారు. వేములవాడ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అన్నదాన సత్రానికి శంకుస్థాపన చేశారు.