12-10-2024 01:43:13 AM
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని, అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యేగా తనకు అందరు ఒక్కటేనని, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని రాకేశ్‌రెడ్డి అన్నారు.
చెక్కుల పంపిణీ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమను ఫంక్షన్‌హాల్‌లోకి అనుమతించడం లేదని బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు బీజేపీ వారిని అనుమతించాలని, లేదంటే ఇద్దరినీ బయటకు పంపాలని పోలీసులను ఆదేశించారు.
దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే తన వద్ద గన్ ఉన్నదని, ఆ విషయం కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పాలని పోలీసు అధికారులకు తెలిపారు. అనంతరం పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను ఫంక్షన్‌హాల్‌లోకి అనుమతించారు. కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య పాల్గొన్నారు.