గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్...
ముషీరాబాద్ (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి పార్కుల అభివృద్ధి, సుందరీకరణను త్వరితగతిన పూర్తి చేయాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆమె అధికారులతో కలిసి గాంధీనగర్ డివిజన్ లోని సురభి పార్క్(పి అండ్ టి పార్క్), కెనరా బ్యాంక్ పార్క్,అశోక్ నగర్ పార్క్-1, పార్క్-2 లను సందర్శించారు. హార్టికల్చర్, ఇంజనీరింగ్ స్ట్రీట్ లైట్స్ అధికారులతో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... తాము మొదటి నుండి పార్క్ ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి వహించి కృషి చేస్తున్నామని, ఇప్పటికీ పనులు నత్తనడకన సాగడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కుల్లో సరిపడే వెలుతురు లేక అందకారంగా మారిందని, దాని వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పార్కు సమీపంలోని కాలనీల ప్రజలు, స్థానికుల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు.
వెంటనే ప్రతి పార్కు ప్రకాశవంతంగా వెలుతురు వుండేలా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఇంజనీర్ అశోక్ కుమార్, సూపర్వైజర్ బాలు నాయక్ లను ఆదేశించారు. లాన్ ఏర్పాటు, పూల మొక్కలతో పాటు చల్లటి నీడను ఇచ్చే పచ్చటి చెట్ల ఏర్పాటుకు హార్టికల్చర్ ఏఈ సంజయ్ సిబ్బందికి సూచించారు. పార్కుల చుట్టూ ఎత్తైన ఫెన్సింగ్, నూతన గేట్ల ఏర్పాటు వాకింగ్ చేసే వారికి అనుగుణంగా వుండేలా పాత్ వే, ఓపెన్ జిమ్ నిర్మాణం లాంటి పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ లను ఆదేశించారు. త్వరలో పనులు పూర్తి చేసి వేసవి కాలంలో పిల్లలు, వృద్ధులు సేద తీరెందుకు డివిజన్ లోని పార్క్లు అధుబాటులోకి తేవాలని కార్పొరేటర్ కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, సత్తి రెడ్డి,పి.నర్సింగ్ రావు, సాయి కుమార్, ఆనంద్ రావు, ప్రశాంత్ పాల్గొన్నారు.