calender_icon.png 2 November, 2024 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవెగౌడ మనవడు పరార్!

29-04-2024 12:32:07 AM

పోలింగ్‌కు ముందు ప్రజ్వల్ అసభ్యకర వీడియోలు వైరల్ 

దర్యాప్తునకు సిట్‌ను నియమిస్తామన్న ప్రభుత్వం

ఫ్రాంక్‌ఫర్ట్‌కు పయనమైన హసన్ ఎంపీ అభ్యర్థి

మార్ఫింగ్ వీడియోలతో కావాలనే అసత్య ప్రచారం: జేడీఎస్

బెంగళూరు, ఏప్రిల్ 28: జేడీఎస్ అధినేత దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ఎన్నికల వేళ ఈ వీడియోలపై దుమారం చెలరేగడంతో ప్రజ్వల్ భారత్‌ను విడిచి విదేశాలకు వెళ్లారు. బెంగళూరు నుంచి శనివారం ఉదయం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన వేళ ఆయన విదేశాలకు వెళ్లడం గమనార్హం. 

దర్యాప్తునకు సిట్..! 

హసన్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న జరగగా.. అంతకు రెండు రోజుల ముందు ఈ వీడియోలు బయటికి వచ్చాయి. ముఖ్యంగా హసన్ జిల్లాలో ఎక్కువగా వైరల్ అయ్యాయి. మరోవైపు ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ వ్యవహారాల నడుమ కేసు విషయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ప్రజ్వల్‌పై వస్తున్న ఆరోపణల విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేస్తామని శనివారం ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించి కూడా విచారణ చేపడతామని చెప్పారు. 

కావాలనే అసత్య ప్రచారమంటూ.. 

అయితే కేసుకు సంబంధించి జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ స్పందిస్తూ.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రత్యర్థి పేరు చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతించారు. నిజమని తేలితే ప్రజ్వల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తామని తెలిపారు. సిట్ ఏర్పాటు చేస్తామన్న సీఎం నిర్ణయం తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రజ్వల్ ఫిర్యాదు చేశారు. అంతకుముందే ప్రజ్వల్ పేరు చెడగొట్టేందుకు పలువురు ఈ వీడియోలను వైరల్ చేశారని జేడీఎస్ ఎన్నికల ఏజెంట్ పూర్ణచంద్ర గౌడ పోలీసులకు కంప్లయింట్ చేశారు. హసన్ నియోజకవర్గంలో ఈ మార్ఫింగ్ వీడియోలను ఓటర్లకు పంపించి, ప్రజ్వల్‌కు ఓటేయవద్దని ప్రచారం చేసినట్లు ఆరోపించారు.