పోచారంపై మాజీ ఎమ్మెల్యే యెండల ఫిర్యాదు
చర్యలు తీసుకోవాలని దేవాదాయ కమిషనర్‌కు వినతి
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ట్రస్టీగా ఉన్న తిమ్మాపూర్, టీటీడీ దేవస్థానం ట్రస్ట్ నిధులు, ఆస్తులను దుర్వినియోగం చేశారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ దేవాదాయ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవడంతో పాటు ట్రస్ట్ నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని కోరా రు. ట్రస్టీలుగా ఉన్న పోచారం, పోచారం సాంబురెడ్డి ఈ దుర్వినియోగానికి కారకులంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన విరాళాలు, ప్రభుత్వ నిధులు, ముఖ్యమంత్రి మంజూరు చేసిన ప్రత్యేక నిధులనూ దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
దేవాలయం పేరిట ఉన్న 398 ఎకరాల భూములు, దేవాదాయ శాఖ నిధులు రూ.20 కోట్లను పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సాంబురెడ్డి తమ వ్యక్తిగత ట్రస్ట్ పేరిట మార్చుకున్నారని తెలిపారు. హుండీ సహా దేవాలయం ఆదాయం ఏడాదికి రూ.1 కోటికిపైగానే ఉంటుందని, 2 నుంచి 5 కేజీల బంగారం, 25 కేజీల వెండితో పాటు 25 గదుల నుంచి అద్దెల రూపంలో ఆదాయం వస్తుందని, ఇందులో ఎక్కడా పారదర్శకత, జవాబుదారీతనం లేదని అన్నారు. ట్రస్టీలు న్యాయపరమైన అంశాలను తారుమారు చేసి మొత్తం ఆస్తులను స్వాధీనం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దేవాదాయశాఖ అధీనంలో ఉన్న తిమ్మాపూర్, టీటీడీ ఆస్తులను తమ అధీనంలోకి తీసుకునేందుకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సాంబురెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, దేవాదాయశాఖ అధికారులు సైతం ఈ విషయం చెబుతున్నారని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి ఈవో నియామకం చేపట్టారని పేర్కొన్నారు.