అనిశ్చిత మార్కెట్, హ్యుందాయ్ నష్టాల లిస్టింగ్ కారణం
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: తాజాగా ఆటో దిగ్గజం హ్యుందాయ్ ఇండియా స్టాక్ ఎక్సేంజ్‌ల్లో నిస్తేజంగా లిస్ట్‌కావడం, మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల ఫలితం గా ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన విలువను మరోసారి భారీగా తగ్గించుకున్నది. స్విగ్గీకి 15 బిలియన్ డాలర్ల విలువను లెక్కగట్టి, ఐపీవోకు తేవాలన్నది తొలి లక్ష్యం కాగా, ఇప్పు డు కంపెనీ విలువను 25 శాతం తక్కువగా 11.3 బిలియన్ డాలర్లకు తగ్గించినట్లు సం బంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ మేరకు కంపెనీ ఐపీవో ద్వారా సమీకరించే మొత్తం, ఆఫర్ ధర రెండూ తగ్గుతాయి. వరుసగా నాలుగు వారాల నుంచి భారత స్టాక్ మార్కె ట్లో పతనం కొనసాగుతున్నది. రికార్డు గరిష్ఠస్థాయిల నుంచి ఇప్పటికే 8 శాతం మేర స్టాక్ సూచీలు పడిపోయాయి. ఇటీవల లిస్టయిన హ్యుందాయ్ షేరు తొలి రోజునే 7 శాతంపైగా నష్టపోయింది.
ఈ నేపథ్యంలో తన ఐపీవోకు లభించే స్పందన పట్ల ఆందోళన తో ఉన్న స్విగ్గీ తక్కువ విలువకు పబ్లిక్ ఆఫర్‌ను తేవాలని నిర్ణయించినట్టు సమాచారం. తన ప్రస్తుత ఇన్వెస్టర్లయిన సాఫ్ట్‌బ్యాంక్, ప్రొసస్ తదితర సంస్థలతో సంప్రదించినతర్వాత విలువను తగ్గించుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
వాస్తవానికి 2022లో జరిగిన ఫండింగ్ రౌండులోనే స్విగ్గీకి 10.7 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్ లభించింది. ఎంత మొత్తానికి పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించేదీ, ప్రైస్ బ్యాండ్ ఎంత అన్నది ఇంకా కంపెనీ తుది నిర్ణయం తీసుకోలేదు. దాదాపుగా రూ.11,300 కోట్ల ఐపీవోను స్విగ్గీ జారీచేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నవంబర్ 6న ఐపీవో!
ఐపీవోను నవంబర్ తొలివారంలో ప్రారంభించాలని స్విగ్గీ భావిస్తున్నట్టు సమాచారం. నవంబర్ 6న బిడ్డింగ్ ఓపెన్ చేసి, నవంబర్ 8న ముగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయా తేదీలను ఈ వారం ఖరారు చేస్తారు. రూ.11,300 కోట్ల సమీకరణకు ఐపీవో జారీఅవుతుందని, అందులో రూ. 6,800 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలోనూ, రూ. 4,500 కోట్లు తాజా ఈక్విటీ విక్రయం ద్వారా సమీకరించవచ్చని అంచనా.