calender_icon.png 23 January, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలి

23-01-2025 05:21:44 PM

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు...

బాలుర గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ...

నిజామాబాద్ (విజయక్రాంతి): ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్రస్ధాయి పరిశీలనతో పాటు, గ్రామ సభల ద్వారా సేకరించిన వివరాలను వెంటదివెంట ఆన్ లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం బండార్ పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామసభ నిర్వహిస్తున్న తీరును, సదుపాయాల కల్పనను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హులను గుర్తిస్తూ రూపొందించిన ముసాయిదా జాబితాను పరిశీలించి, గ్రామ సభలో చదివి వినిపించారా? అని అడిగి తెలుసుకున్నారు. వివిధ పథకాల కోసం గ్రామ సభలో కొత్తగా వచ్చిన దరఖాస్తుల గురించి ఆరా తీశారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలను ఆన్ లైన్లో అప్లోడ్ చేయించాలని ఆదేశించారు. వివిధ మార్గాల ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చొరవ చూపాలని అన్నారు. అనంతరం బోధన్ పట్టణ శివారులో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని నిశిత పరిశీలన జరిపారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. కూరగాయలు, ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ నేలపై ఉంచకుండా స్టీల్ డబ్బాలలో భద్రపర్చాలని, ఆహారం కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. ప్రతిరోజూ భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన సరుకులు, నాసిరకం కూరగాయలను వినియోగించకూడదని, కోడిగుడ్ల నాణ్యతను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాసిరకమైన బియ్యం, వంట నూనె, ఇతర సరుకులు సరఫరా చేస్తే వెంటనే అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, స్థానిక అధికారులు ఉన్నారు.