- కబ్జా కోరల్లో అమీన్‌పూర్ పెద్దచెరువు
- నాడు విదేశీ పక్షులకు విడిది.. నేడు కబ్జాల పాలు
- సుమారు 350 ఎకరాల చెరువు.. ఇప్పుడు 250 ఎకరాలకు పరిమితం
- ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో యథేచ్చగా అక్రమ కట్టడాలు
సంగారెడ్డి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి)/ పటాన్‌చెరు: ఒకప్పుడు జీవవైవిధ్యానికి ప్రతీకగా.. వందకు పైగా పక్షులకు విడిదిల్లుగా.. పేరు న్న అమీన్‌పూర్ పెద్దచెరువు ఇప్పుడు కబ్జాకోరల్లో చిక్కుకున్నది. ఒకప్పుడు పక్షుల రావాలతో ఆహ్లాదంగా ఉండే ప్రాంతం ఇప్పుడు కన్నీరుపెడుతున్నది. సంగారెడ్డి జిల్లాకు ఆభరణ మైన ఈ చెరువు చిన్నబోతున్నది. హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం ఒకప్పుడు 350 ఎకరా ల్లో ఉన్న చెరువు ఇప్పుడు 250 ఎకరాలకు పరిమితమైంది. 100 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. శిఖంలో సుమారు 200 అక్రమ కట్టడాలు వెలిశాయి. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరువును అరుదైన బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఈ జీవవైవిధ్య నిధి ఇప్పుడు కబ్జాకోరుల పాలవడం జిల్లావాసులకు ఆందోళన కలిగిస్తున్నది.
రియల్టర్ల కబ్జా పడగ..
రియల్టర్లు రాత్రికి చెరువు శిఖంలో లారీలతో మట్టి వేయించి ప్లాట్లు వేస్తున్నారు. చెరువు మధ్యలో ఏకంగా రోడ్డు వేశారు. చెరువును రెండు విభాగాలుగా విడదీశారు. చెరువులో అక్రమ కట్టడాలపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ, మున్సిపల్ అధికారులు సర్వే చేపట్టి సరస్సు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో 200 పైగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించారు. ఇప్పటికే ఆయా నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారుల సమాచారాన్ని హైడ్రా సేకరిస్తునట్లు తెలిసింది. దీంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైందని సమా చారం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల సరస్సును పరిశీలించారు. త్వరలోనే అక్రమాలు బయటకు వస్తాయని, కబ్జా కోరల నుంచి అమీన్‌పూర్ పెద్ద చెరువుకు విముక్తి కలుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.
బయోడైవర్సిటీ ఇలా..
ఏటా చెరువుకు ప్రపంచ నలుమూలల నుంచి 166 రకాల పక్షులు విడిది కోసం వస్తాయి. కానీ జీవవైవిధ్య విధ్వంసంతో ఇక్కడికి విడిదికి వచ్చే పక్షుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తున్నది. ముఖ్యంగా ఫ్లెమింగో పక్షుల రాక పర్యాటకులకు కనుల పండు గ. పక్షులే కాక చెరువు పరిధిలో మొత్తం 250 జాతుల చెట్లు పెరుగుతున్నాయి. సరుస్సులో వివిధ రకాల చేపల గుర్తింపు జరిగింది. 41 రకాల సీతాకోక చిలుకలు ఇక్కడ విహరిస్తాయి. గత ప్రభుత్వం చెరు వు పరిరక్షణకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదనే చెప్పాలి.