క్రమంగా ఖాళీ అవుతున్న చెరువులోని నీరు
పోలీసులకు ఇరిగేషన్ ఏఈ పరమేష్ ఫిర్యాదు
పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరులపై అనుమానం
తూమును పరిశీలించిన పలు పార్టీల నేతలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): చెరువుల సంరక్షణకు ఓ వైపు హైడ్రా చర్యలు తీసుకుంటుంటే మరో వైపు అతిపురాత చెరువుల విధ్వంసం జరుగుతుం ది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల పోచా రం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో విస్తరించి ఉన్న నాడెం చెరువు తూమును శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. బీఆర్‌ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ చెరువును ఆక్రమించి అనురాగ్ యూనివర్సిటీని, నీలిమ మెడికల్ కాలేజ్‌ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నా యి.
ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో నాడెం చెరువులో నీటిమట్టం పెరు గుతున్నది. నీటి మట్టం మరింత పెరిగితే అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజ్‌లోకి నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో చెరువు తూమును ధ్వంసం చేయడం వల్ల చెరువులో నీటి మట్టం తగ్గుతుందని, అలాగే చెరువులోని నీటికి అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజ్ నిర్మాణాలు దూరంగా కనిపిస్తాయనే కుట్రలో భాగంగా నే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరులు ఈ విధ్వంసానికి పాల్పడి ఉంటారని స్థానిక ప్రజలు, వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు.
నాడెం చెరువు ఆక్రమణపై హైడ్రా, ఇరిగేషన్ అధికారులు జారీచేసిన నోటీసుల ను సవాల్ చేస్తూ ఈ విద్యాసంస్థలు కోర్టును ఆశ్రయించాయి. బఫర్, ఎఫ్‌టీఎల్‌లో అనుమతులు తీసుకున్నా అవి వ్యవస్థలను మేనే జ్ చేసి తీసుకున్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఇటీవల హైకోర్టు ప్రకటించటంతోపాటు నాడెం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని, చెరువు పూర్తి విస్తీర్ణా న్ని గుర్తించి పరిరక్షించాలని ప్రభుత్వానికి సూచించింది.
పోలీసులకు ఫిర్యాదు
నాడెం చెరువు తూము ధ్వంసం చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఘట్‌కేసర్ ఇరిగేషన్ ఏఈ పరమేష్ పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. వెంకటాపూర్ నాడెం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ పరిధులను తొలగించే కుట్ర కోణం వెనుకున్న బడాబాబుల దుర్మార్గాన్ని అధికారులు బయటపెట్టాలని- బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తూము ధ్వంసం అయిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. తూమును పగలగొట్టి చెరువును ఖాళీ చేసే కుట్రలు చేసిన కబ్జాదారుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.
నాడెం చెరువు తూంను రాత్రికి రాత్రే ధ్వసం చేసి చెరువులోని నీళ్లు తీయాలని చూసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ డిమాండ్ చేశారు. నాడెం చెరువును కబ్జా చేసినవారే తూములను ధ్వసం చేసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయమై హైడ్రా కమిషనర్‌కు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రోడ్డును కుదించినవారిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్‌ను కోరారు.