calender_icon.png 16 October, 2024 | 5:59 PM

బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సింగరేణి విధ్వంసం

16-10-2024 03:41:57 PM

నూతన గనులతోనే భవిష్యత్తు 

హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు జె శ్రీనివాస్ 

మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణికి నూతన గనులు లభించి, స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే, గత ప్రభుత్వంతోనే సింగరేణి విధ్వంసం మొదలైందని సింగరేణి మైనర్స్, ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎంఎస్) ఏరియా ఉపాధ్యక్షుడు జె శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం ఏరియాలోని ఆర్కేపి ఓసిపిపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014 నుండి 2024 వరకు గడిచిన 10 ఏండ్ల కాలంలో సింగరేణి యాజమాన్యం ఒక నూతన గనిని ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు.

సింగరేణిలో 2014లో 65 వేల మంది కార్మికులు ఉండగా, ప్రస్తుతం 40 వేల మంది కార్మికులు మాత్రమే ఉండటం అభివృద్ధా అని ప్రశ్నించారు. సింగరేణికి జెన్కో తదితర థర్మల్ విద్యుత్  కేంద్రాలు చెల్లించాల్సిన బకాయిలు 34 వేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏరియాలోని ఆర్కేపి ఓసిపి ని సరైన ప్రణాళిక లేక మూసి వేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా అటవీశాఖ క్లియరెన్స్, ఫ్యూచర్ అడ్వాన్స్ థింకింగ్ ప్రణాళిక లోపం వలన కార్మికులు ఇబ్బందుల పాలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏరియా బతకాలంటే ఆర్కేపి ఓసిపీ, కేకే 6, శ్రావణ్ పల్లి ఓసిపి లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెల్ది సుదర్శన్, చొప్పరి రామస్వామి, ప్రభాకర్ లు పాల్గొన్నారు.