నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): గుప్తనిధుల కోసం పురాతన కాకతీయుల కాలంనాటి ఏకశిలా గణపతి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని హనుమాన్ ఆలయ వెనకాల కాకతీయుల కాలం నాటి ఏకశిల గణపతి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి డ్రిల్ వేసి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. మరికొద్ది అడుగుల మేర తవ్వి గుప్తనిధుల కోసం వేటాడారు. ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.