calender_icon.png 1 October, 2024 | 3:01 AM

కేసీఆర్ పాలనలోనే నగరంలో విధ్వంసం

01-10-2024 12:51:37 AM

  1. చెరువుల కబ్జాల్లో బీఆర్‌ఎస్ నేతలే ఎక్కువ 
  2. మూసీ సుందరీకరణ గులాబీ నేతలకు ఇష్టం లేదా?  
  3. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఫైర్

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలోనే హైదరాబాద్ అధికంగా  విధ్వసంమైందని, ఆ పార్టీ నేతలే ఎక్కువగా చెరువులను కబ్జా చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్  విమర్శించారు. అరగంట వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి దారుణంగా అవుతోందన్నారు.

మూసీ పరివాహకంలో ఇప్పటి వరకు ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూల్చలేదని, బీఆర్‌ఎస్ నేతల తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుఉందని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, పీసీసీ అధికార ప్రతినిధులు సామా రామ్మోహన్‌రెడ్డి,  భవానీరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

మూసీ ప్రక్షాళన అన్ని పార్టీల అజెండాలో ఉందన్నా రు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు అన్యాయం చేస్తున్నామని గులాబీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మూసీ చుట్టూ 25 లక్షల మంది జీవిస్తున్నారని, ఇక్కడ నివసించేవారు తరుచూ అనారోగ్యం పాలవుతున్నారన్నారు.

అక్రమ నిర్మాణాలను కూలుస్తామని 2016లో కేసీఆరే చెప్పారని గుర్తుచేశారు. హైడ్రా ఒక యజ్ఞంలా ముందుకు వెళ్తుందన్నారు. మూసీ మధ్యలో కట్టిన కట్టడాలను తొలగింపుతో ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ బాగుంటుందన్నారు. సోషల్ మీడియాలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై అసత్య ప్రచారం చేయడంతగదని, పోలీసులు సోష ల్ మీడియాపై దృష్టి సారించాలన్నారు. 

బీఆర్‌ఎస్ హయాంలో ఫామ్‌హౌస్‌ల చుట్టే అభివృద్ధి

కేసీఆర్, కేటీఆర్ కలిసి జన్వాడ చుట్టే అభివృద్ది చేసి.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్లుగా చెబుతున్నారని మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం రాష్ట్ర మీద పడి దోచుకుందని, పక్క రాష్ట్రంలో జరిగిన ఘటనలను ఇక్కడ జరిగినట్లు కట్టు కథలతో వీడియోలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు బీజేపీ ఎంపీ రఘునందర్‌రావు దండ వేస్తే.. ఆ విషయంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మహేశ్‌కుమార్ మండిపడ్డారు. కవిత లిక్కర్ కేసులో అరెస్టయితే.. తాము ఒక మహిళగానే చూశామని, ఎప్పుడూ అగౌరవ పరిచేలా మాట్లాడలేదన్నారు.

హరీశ్.. రుణమాఫీపై చర్చకు సిద్ధమా? 

పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో, 9 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయంలో అనుసరించిన తీరును బీఆర్‌ఎస్ నేతలు ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్‌కు పసుపుబోర్డు తెస్తానని బాండ్‌పేపర్ రాసిచ్చిన హామీ నేరవేర్చకుండా రైతులను మోసం చేశారని మహేశ్‌కుమార్ ఆరోపించారు.