calender_icon.png 30 October, 2024 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇజ్రాయెల్‌ను నాశనం చేయండి

02-08-2024 01:01:45 AM

  1. సైన్యానికి ఇరాన్ సుప్రీంలీడర్ ఆదేశం
  2. హమాస్ నేత హనియే హత్యపై ఆగ్రహం
  3. యూదు దేశాన్ని నాశనం చేద్ధామని శపథం

టెహ్రాన్, ఆగస్టు 1: తమ దేశంలోకి చొచ్చుకొని, తమకు అత్యంత ఆప్తుడైన హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను హత్యచేసిన ఇజ్రాయెల్‌ను నాశనం చేసేవరకు వదిలేది లేదని ఇరాన్ సుప్రీంలీడర్, మత పెద్ద అయతొల్లా అలీ ఖొమేనీ శపథం చేశారు. వెంటనే ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేయాలని తమ దేశ సైన్యాన్ని ఆదేశించారు. దేశ రాజధాని టెహ్రాన్‌లోని కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి చొచ్చుకొచ్చి హనియేను ఇజ్రాయెల్ ఏజెంట్లు హనియేను చంపేయటాన్ని ఇరాన్ తీవ్ర అవమానంగా భావిస్తున్నది.

బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఏజెంట్లు ఆయన ఇంట్లోనే చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే ఇరాన్ అత్యున్నత భద్రతా మండలి ఖొమేనీ నివాసంలో సమావేశమైంది. ఆ సమావేశంలో ఇరాన్ సైనిక పెద్దలు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇజ్రాయెల్‌పై నేరుగా బాంబుల వర్షం కురిపించాలని సైన్యాన్ని ఖొమేనీ ఆదేశించినట్టు ఆ దేశ వార్తా సంస్థలు తెలిపాయి. 

నాలుగు నెలల క్రితమే ఘర్షణలు

గాజాలో హమాస్ ఘర్షణలు మొదలైన తర్వాత ఇరాన్‌తో కూడా ఇజ్రాయెల్ నేరుగా తలపడింది. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసి సైనిక కమాండర్లను చంపేయటంతో ఈ ఘర్షణ తలెత్తింది. గత ఏప్రిల్‌లో రెండు దేశాలు పరస్పరం క్షిపణులు ప్రయోగించుకొన్నాయి. అయితే, రెండు దేశాలకు క్షపణి రక్షణ వ్యవస్థలు ఉండటంతో పెద్దగా నష్టం జరుగలేదు. మరి ఈసారి ఇరాన్ ఇజ్రాయెల్‌పై ఎలాంటి దాడులు చేస్తుందన్నది తెలియరాలేదు. ఇజ్రాయెల్ అణ్వాయుధ దేశం. ఇరాన్ అణ్వాయుధాలు తయారుచేయలేకపోయింది. ఇరాన్‌తో పోల్చితే ఇజ్రాయెల్ వైమాని, నేవీ, ఆయుధ సంపత్తి కూడా ఎక్కువే.  అయితే, సాయుధ డ్రోన్ల విషయంలో మాత్రం ఇరాన్ చాలా ముందున్నది. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన చాలా డ్రోన్లు ఇరాన్‌లో తయారైనవే.