ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలంలోని రామచంద్రునిపేట గ్రామానికి చెందిన కీసరి వెంకటేశ్వర్లు కుమారుడు కీసరి మధు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ కళాశాల బోటనీ అధ్యాపకునిగా ఎంపికయ్యాడు. టిజిపిఎస్సి నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 73వ ర్యాంక్ సాధించి సత్తుపల్లి ఎస్ బి ఎస్ జూనియర్ కళాశాలలో బోటనీ అధ్యాపకునిగా నియామకం అయ్యారు. ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ.. తన విజయానికి కారణం తన తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, మణెమ్మ తన చెల్లి మాధవి, తమ్ముడు రాము ప్రోత్సహం ఉందన్నారు.
తన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా చాలా కష్టపడి మా ముగ్గుర్ని ఉన్నతంగా చదివించారని తెలిపారు. తన చదువు ఒకటి నుంచి ఐదు వరకు స్థానికంగా రామచంద్రపేట ప్రాథమిక పాఠశాలలో, ఆరు నుంచి పది వరకు బోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంటర్ ది మెరిట్ జూనియర్ కాలేజ్ ఇల్లందు, డిగ్రీ స్నేహ కాలేజ్ ఇల్లందులో, ఎమ్మెస్సీ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో చదివినట్లు వివరించారు. అనేక రకాలుగా అనేక మంది అవమానించారని, ఈ విజయంతో వారందరికీ సంతోషంగా సమాధానం ఇవ్వాలని అనుకుని కష్టపడి చదివి సమాధానం ఇచ్చానని తెలిపారు. తన లక్ష్యం సివిల్స్ సాధించాలనేదే తన లక్ష్యమని మధు తెలిపారు. అది కూడా కష్టపడి సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.