calender_icon.png 13 October, 2024 | 11:54 AM

సవాళ్లున్నా మంచి వృద్ధి సాధించాం

22-08-2024 12:30:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 21: గత కొద్ది ఏండ్లలో సవాళ్లు ఎదురైనా భారత్ వృద్ధి భేషుగ్గా ఉన్నదని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.  కొవిడ్ పాండమిక్, ఉక్రెయిన్ యుద్ధం, ఇతర గ్లోబల్ ఉద్రిక్తతలతో గత ఐదారేండ్లలో ‘తీవ్ర ఒడిదుడుకుల’ సమయంగా చెప్పారు. తొలి, మలి, డెల్టా వేవ్‌ల రూపాల్లో కొవిడ్ వేవ్స్‌గా వచ్చిందని, వెనువెంటనే ఉక్రెయిన్ యుద్ధం ఎదురయ్యిందని ఈ సవాళ్లను అధిగమిస్తూరా వడం అత్యంత క్లిష్టమైనదని దాస్ తెలిపారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ ‘కొవిడ్ సంక్షోభం ప్రతీ ఆర్థిక వ్యవస్థా శాశ్వతంగా ఉత్పత్తిని నష్టపోయింది. భారత్ విషయానికొస్తే మనం ఆ సంక్షోభం నుంచి బయటప డటం అత్యుత్తమమం’ అని అభివర్ణించారు. 

అదుపులో ద్రవ్యోల్బణం

ఈరోజు ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని, కానీ 4 శాతం లక్ష్యాన్ని సాధించడానికి మరికొంత సమయం పడుతుందని దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యమని, ఈ ఏడాది సగటు ద్రవ్యోల్బణం రేటు 4.5 శాతం ఉంటుందని తెలిపారు. మూల ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని తీసివేసి తగ్గిందని చూపించడం పరిష్కారం కాదన్నారు.

మొత్తం వినియగ బాస్కెట్‌లో ఆహార ద్రవ్యోల్బణం వాటా 46 శాతమని, కుటుంబాలు దాదాపు 50 శాతం ఆహారానికే ఖర్చు చేస్తాయన్నారు. ఫైనాన్షియల్ రంగం మరింత స్థిరంగా, గతంలోకంటే బలంగా ఉన్నదన్నారు. ధరల్లో స్థిరత్వాన్ని తీసుకురావాల్సి ఉన్నదని, అప్పుడే వినియోగదారు, మదుపుదారు విశ్వాసం పెంపొందుతుందని చెప్పారు.  ఈ ఆర్థిక సంవత్సరం 7.2 శాతం వృద్ధిని తాము అంచనా వేస్తున్నామని, వృద్ధి తగ్గే సూచనలు ఏవీ లేవని, స్థిరంగా ఉన్నదని వివరించారు. 

దాస్‌కు ప్రధాని అభినందనలు

వరుసగా రెండో ఏడాది ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా ఎంపికైన శక్తికాంత్‌దాస్‌కు ప్రధాని నరేంద్ర మోది అభినందనలు తెలిపారు. ఆర్బీఐలో దాస్ నాయక త్వానికి, ఆర్థికాభివృద్ధి, స్థిరత్వానికి ఆయన చేసిన కృషికి ఇది గుర్తింపు అని ప్రధాని సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ పోస్టులో కొనియాడారు. యూఎస్‌కు చెందిన గ్లోబల్ మ్యాగజైన్ గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో శక్తికాంత్ దాస్‌కు అగ్రశ్రేణి ‘ఏ+’ రేటింగ్‌ను ఇచ్చింది.