calender_icon.png 23 October, 2024 | 2:16 AM

అంతర్జాతీయ సవాళ్లున్నా ఎగుమతులు భేష్

16-07-2024 01:09:05 AM

వాణిజ్య మంత్రి గోయల్

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎగుమతుల్లో సానుకూల వృద్ది నమోదైనట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సేవల రంగంలో వృద్ధి ఇందుకు ఉపకరించిందన్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధాలు, ఎర్ర సముద్రం సంక్షో భం, కంటైనర్ కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ ఎగుమతులు వృద్ధి చెందాయని గోయల్ వివరించారు. ప్రభుత్వ డిజిటల్ ఇండియా మిషన్ వల్ల సేవల రంగానికి తోడ్పాటు లభిస్తున్నట్లు పేర్కొన్నారు.

సేవల ఎగుమతులు పెరగడానికి దేశంలో మొబైల్ 4జీ, 5జీ సేవల విస్తృతి కూడా కారణమన్నారు. అంతర్జాతీయ మందగమన పరిస్థితు లు మెరుగుపడటంతో పాటు అమెరికా, ఐరోపాల్లో వడ్డీ రేట్లు తగ్గితే దేశంలో ఎఫ్‌డిఐలు పెరగడం ప్రారంభమవుతాయని అంచనా వేశారు. భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐలు) భారీగా వస్తున్నాయని, భారత్‌పై పెట్టుబడిదార్ల విశ్వాసాన్ని ఇవి చూపుతున్నట్లు గుర్తుచేశారు. మేలో భారత వస్తు ఎగుమతులు 9.1శాతం పెరిగి 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్-, మే నెలల్లో ఎగుమతులు 5.1శాతం వృద్ధితో 73.12 బిలియన్ డాలర్లకు చేరాయి.