calender_icon.png 18 October, 2024 | 3:43 PM

విప్లవ వీరుడికి నీరాజనం

18-10-2024 02:05:01 AM

  1. పులకించిన పోరుగడ్డ జోడేఘాట్
  2. కుమ్రంభీంకు మంత్రి సీతక్క, ఎంపీ, ఎమ్మెల్యేల నివాళి
  3. ఆదివాసీల అభివృదికి కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లడి

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): జల్ జంగిల్ జమీన్ కోసం నిజాం నిరంకుశ పాలనపై వీరోచిన పోరాటం చేసిన విప్లవ వీరుడు కుమ్రంభీంకు వర్ధంతి సందర్భంగా నాయకులు, ప్రజలు నీరాజనం పలికారు. వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులతో పోరుగడ్డ పులకించింది.

ఐటీడీఏ అధ్వర్యంలో జోడేఘాట్‌లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో మంత్రి సీతక్క, బీం మనుమడు కుమ్రం సోనేరావుతో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆదివాసీ హక్కుల కోసం వీరోచితంగా పోరాడిన యోధుడు కుమ్రంభీం అన్నారు. పేసా చట్టం, 1/70 చట్టాలు రావడానికి నాడు కుమ్రంభీం, రాంజీ గోండ్, బిర్సాముండే లాంటివారి పోరాటాలే కారణమని తెలిపారు.

ఈ ప్రాంతంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. జిల్లా అభివృద్ధి, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి త్వరలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. అకారణంగా ఆదివాసీ, గిరిజనులపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

జోడేఘాట్‌లో పర్యటించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా చేసేందుకు చర్యలు తీసుకొంటామని స్పష్టంచేశారు. ఇక్కడి ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంత భూములు, అడవులు ఆక్రమణలకు గురికాకుండా కాపావలసిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.  

గిరిజన సంస్థల బలోపేతానికి కేంద్రం కృషి

సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలను బలోపేతం చేసి దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకవెళతానని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో అటవీ అనుమతులకు లేకుండా అగిపోయిన రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ భీం ఆశయసాధనకు కృషి చేస్తానని చెప్పారు.

అనంతరం కుమ్రంభీం జీవిత చరిత్రపై చిత్రీకరించిన లఘు చిత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు, ఆదివాసీ యువత చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీశ్‌బాబు, ప్రేంసాగర్‌రావు, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, రామగుండం సీపీ శ్రీనివాస్, ఐటీడీఏ పీవో ఖుష్భు గుప్తా, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పెందూర్ రాజేశ్వర్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.