హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్,(విజయక్రాంతి): మూసి ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టినందున మూసి పరివాహక ప్రాంతంలోని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేందుకు వివరాలు సేకరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డిఓ, తహసీల్దార్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు తదితరులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మూసి ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టినందున మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పునరావాసం కల్పించేందుకు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేందుకు మూసి పరివాహక ప్రాంతంలోని పేదల వివరాలు సేకరించేoదుకు 16 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్, జిహెచ్ఎంసి, పోలీస్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ లు ఉంటారని అన్నారు. ఒక్కొక్క బృందం మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న 75 గ్రహాలను సందర్శించి ఇండ్ల యొక్క యజమాని/కిరాయిదారు యొక్క ఆధార్/వయస్సు/కులం/ఫిజీకల్ హ్యాండీక్యాప్/ఇతర వివరాలు సేకరించాలని తెలిపారు. సర్వే ప్రశాంతంగా జరగాలని తెలిపారు. ప్రతి 2 బృందాలకు పర్యావేక్షణ అధికారిగా ఒక డిప్యూటీ కలెక్టర్ ను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకట చారి, ఆర్ డి ఓ మహిపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ లు, ఆర్ ఐ లు,సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు