దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): గత పాలకుల కాలంలో తెలంగాణలోని దివ్యాంగులు నిర్లక్ష్యానికి గురయ్యారని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో దివ్యాంగుల శాఖలో ఎన్నో అక్రమాలు జరిగాయని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు.
అప్పటి మంత్రి హరీశ్‌రావు దివ్యాంగుల సంస్థలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నవ్యక్తిని.. ఎలాంటి సీనియార్టీ చూడకుండానే డైరెక్టర్‌గా ప్రమోషన్ ఇప్పించారని ఆరోపించారు. అప్పుడున్న శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అండతో మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్టర్ పోస్టులో ఐఏఎస్ స్థాయి అధికారి ఉండాల్సింది.. కానీ గ్రూప్ అధికారిని నియమించారని పేర్కొన్నారు.
కార్పొరేషన్‌కు సంబంధించిన ఆడిటింగ్ జరగకపోవడంతో కేంద్రం నుంచి నిధులు కూడా రాలేదని స్పష్టంచేశారు. గత పదేళ్లలో రూ.40 కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. సంస్థలో జరిగిన లావాదేవీలపై హెడ్ ఆఫీస్‌లో రికార్డులు, లబ్ధిదారుల రికార్డులు లేవని, ఎవరు మాయం చేశారో తేలుస్తామన్నారు. కార్పొరేషన్‌లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరిపిస్తామన్నారు.