అధికారులను హెచ్చరించిన పిఓ రాహుల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లోని ఐటీడీఏ కార్యాలయంలోని వివిధ విభాగాలలో పనిచేయుచున్న అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించి తమ విధులు సక్రమంగా నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తప్పవని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలోని విభాగాలను పూర్తిస్థాయిలో తిరిగి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల కుటుంబాలను ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్లడానికి, ముఖ్యంగా విద్యా, వైద్యం గిరిజన గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడానికి, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలను నెలకొల్పడం జరిగిందని అన్నారు. కార్యాలయానికి వివిధ పనులపై గిరిజనులు ప్రతిరోజూ వస్తున్నందున కార్యాలయం అధికారులు సిబ్బంది వారికి కావలసిన పనులు సకాలంలో చేసి పెట్టాలని, గిరిజనుల పనుల విషయంలో మాత్రం అశ్రద్ధ చేయవద్దని మరియు గిరిజనులు ఐటీడీఏ కార్యాలయం దగ్గర పనుల నిమిత్తం సమయం వృధా చేయకుండా చూడాలని అన్నారు.
ప్రతిరోజు వారి విభాగంలోని గదులు శుభ్రంగా ఉంచుకోవాలని, పనికిరాని సామానులు ఏమైనా ఉంటే పూర్తిస్థాయిలో తొలగించాలని, ప్రతి కార్యాలయం గదులు చూపరులకు కనువిందు చేసేలా అందంగా తీర్చిదిద్దాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వివిధ విభాగాలకు వచ్చే గిరిజనులకు మర్యాదపూర్వకంగా పలకరించి వారికి కావలసిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఐటీడీఏలోని ప్రతి విభాగమును పరిశీలించి గిరిజన సంక్షేమానికి మరియు గిరిజనుల కొరకు సిబ్బంది చేస్తున్న పనులను సంబంధిత అధికారులను సిబ్బందిని అడిగి తెలుసుకుని, కార్యాలయంకు వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన గిరిజనులకు కావాల్సిన పనులు చేసి పెట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు మేనేజర్ ఆదినారాయణ, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.