- విద్యార్థుల మార్కుల జాబితా తారుమారు
- ఫెయిలైన వారు పాస్.. ఉత్తీర్ణులు ఫెయిల్
- ఓయూ అధికారుల సంతకాలు ఫోర్జరీ
- నిజమేనని నిర్ధారించిన విచారణ కమిటీ
- స్వయం ప్రతిపత్తి రద్దుకు యూజీసీకి ఓయూ లేఖ
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): హిందీ మహావిద్యాలయం అనుమతులను ఉస్మానియా యూనివర్సిటీ రద్దు చేసింది. విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్టు ఓయూ విచారణ కమిటీ తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శనివారం తెలిపింది.
విద్యార్థుల విద్యాధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేసిన ఆ కళాశాలపై ఓయూ కఠిన చర్యలకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తీర్ణులైన విద్యార్థులను ఫెయిలైనట్టుగా, ఫెయిలైన విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు తప్పుడు సమాచారాన్ని అందించిన హిందీ మహావిద్యాలయ అనుబంధ గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
2019 విద్యాసంవత్సరానికి సంబంధించి యూజీ ఆరో సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిలైన 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు, ఉత్తీర్ణులైన ఐదుగురు ఫెయిలైనట్టు తారుమారు చేసిన జాబితాను ఓయూ పరీక్షల నియంత్రణ కార్యాలయానికి ఆ విద్యాసంస్థ సమర్పించింది.
సదరు విద్యాసంస్థ టీఆర్ (ట్యాబులేషన్ రికార్డ్స్) రికార్డులపై అనుమానం రావటంతో ఓయూ అధికార యం త్రాంగం సమగ్ర విచారణకు ఆదేశించింది. మూడు దఫాలుగా హిందీ మహావిద్యాలయ విద్యాసంస్థను సందర్శించిన కమిటీ విస్తుపోయే అంశాలను గుర్తించింది.
స్వయం ప్రతిపత్తి కలిగిన హిందీ మాహావిద్యాలయ స్వయంగా పరీక్షల నిర్వహణ, పేపర్ ఎవాల్యూషన్ (మూల్యాంకనం) తమ అధ్యాపకులతోనే నిర్వహిస్తోంది. ఇదే అదనుగా అక్రమాలకు పాల్పడ్డట్టు కమిటీ గుర్తించింది.
కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులతో కామర్స్ పత్రాలు
కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు కామర్స్ సమాధాన పత్రాలను దిద్దినట్లుట్టు విచారణలో తేలింది. విద్యార్థుల మార్కుల జాబితా లన్నీ ఫోర్జరీ చేసినట్టుగా కమిటీ గుర్తించింది. పరీక్ష పత్రాలు, ఎవాల్యూషన్, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కళాశాల యాజమాన్యం కమిటీకి సమర్పించకపోవటం గమనార్హం.
యూనివర్శిటీ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కిన కళాశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిందిగా కమిటీ అభిప్రాయపడింది. మరో దఫా కళాశాలను సందర్శించిన ఓయూ విచారణ కమిటీ యూజీ 2023 బ్యాచ్ టీఆర్ రికార్డుల్లో ప్రిన్సిపల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకాలు, స్టాంపులు లేనట్టు గుర్తిం చింది. దీంతో యూనివర్శిటీ తుది నిర్ణయం తీసుకునేంత వరకు కళాశాల స్వయం ప్రతిపత్తిని అబయన్స్‌లో పెట్టాలని కమిటీ సిఫార్సు చేసింది.
సంతకాలు ఫోర్జరీ చేసి..
తుది నిర్ణయం కోసం వేసిన మరో కమిటీ 4 అక్టోబర్ 2024న సమగ్ర విచారణ చేపట్టింది. యూనివర్శిటీకి సమర్పించిన 2022 యూజీ ఆరో సెమిస్టర్ ఫలితాలు తప్పని, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేల్చారు. హిందీ మహా విద్యాలయ యాజమాన్యం.. 13 మంది బీకాం, 27 మంది బీఎస్సీ, 9 మంది బీబీఏ విద్యార్థులు పాసైనట్టు యూనివర్శిటీకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్టు తేలింది.
నలుగురు బీకాం, ఒక బీబీఏ విద్యార్థి ఉత్తీర్ణులైనప్పటికీ ఫెయిలైనట్టు రికార్డులు తారుమారు చేసింది. ఈ విషయమై వివరణ ఇచ్చిన కళాశాల యాజమాన్యం తమ పరీక్షల విభాగం రికార్డుల్లో పొరపాటు జరిగినట్టు ఒప్పుకొంది. అయినా తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓయూ పరీక్షల విభాగం ఈ విషయమై పదేపదే హెచ్చరించినప్పటికీ హిందీ మహావిద్యాలయం స్పందిం చలేదు.
దీంతో విచారణ కమిటీల నివేదికలను యూనివర్శిటీ స్థాయి సంఘానికి నివేదించింది. ఈ విషయమై తీవ్రంగా స్పందించిన ఓయూ స్థాయి సంఘం (స్టాండింగ్ కమిటీ) సంబంధిత రికార్డులను సత్వరమే సీజ్ చేయాల్సిందిగా ఓయూ పరీక్షల నియంత్రణాధికారి, డీన్ సీడీసీలను అదేశించింది.
ఓయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టంచేసింది. కళాశాల స్వయంప్రతిపత్తిని రద్దు చేయాల్సిందిగా యూజీసీ, రాష్ర్ట ఉన్నత విద్యాశాఖ అధికారులను కోరాలని సిఫార్సు చేసింది.
ప్రస్తుత విద్యాసంవత్సరానికి మినహాయింపు : ఓయూ
ఓయూ పరిధిలో మరెక్కడా హిందీ మీడియం కళాశాలలు లేనందున, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు మినహాయింపునిచ్చింది. అయితే, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎలాంటి యూజీ అడ్మిషన్లు చేపట్టవద్దని స్పష్టం చేసింది. సాధారణంగా పీజీ తరగతులు నాన్ అటానమస్ స్టేటస్‌తో కొనసాగించుకోవచ్చని తెలిపింది.
తుది సెమిస్టర్ పరీక్షలను స్వయంగా యూనివర్శిటీ నిర్వహించనుంది. స్థాయీ సంఘం(స్టాండింగ్ కమిటీ) సిఫార్సుల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఫలితంగా ఎలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చింది.
అనుబంధ, స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలు.. యూనివర్శిటీ, యూజీసీ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని ఓయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం స్పష్టంచేశారు. విద్యా ప్రమాణాలు, పారదర్శకత, నిబంధనల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.