calender_icon.png 18 March, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే స్వయం ఉపాధిపై దృష్టి: భట్టి

17-03-2025 07:04:16 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా సోమవారం రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియను తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో పాటు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. యువ వికాసం పథకం ఉపయోగించుకుని యువత ఉపాధి కల్పించుకోవాలని, ఉద్యోగాలు లభించక గ్రామీణ యువత ఇబ్బందులు ఎదుర్కుంటోందని పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే ఈ ప్రభుత్వం 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని, అలాగే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనే ధర్నాలు జరిగేవన్నారు.

ఇప్పుడు నోటిఫికేషన్ల మధ్య కొంత గ్యాప్ ఇవ్వండంటూ ధర్నాలు జరిగే రోజులు వచ్చాయని భట్టి అభిప్రాయపడ్డారు. ఈ ప్రజాప్రభుత్వం యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పనతోపాటు స్వయం ఉపాధిపైనా దృష్టి సారించిందని చెప్పారు. గతంలో కార్పొరేషన్ల ద్వారా పథకాలు ప్రకటించారు కానీ, నిధులు ఇవ్వలేదు.. అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. అన్ని క్యాలెండర్ డేట్ల ప్రకారమే జరగాలని సీఎం చెప్పారని, ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగ యువత ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయంలో అధికారులకు సమర్పించాలని, అన్ని పరిశీలించి ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2న యూనిట్లు మంజూరు పత్రాలు ఇస్తామని భట్టి వెల్లడించారు.  యువ వికాసం యువతకు 3 కేటగిరీలుగా రాయతీ రుణాలు ఉంటాయన్నారు. మొదటి కేటగిరి కింద రూ.లక్ష వరకు రుణం 80 శాతం రాయితీ, రెండో కేటగిరి కింద రూ.2 లక్షల వరకు రుణం, 70 శాతం రాయితీ, మూడో కేటగిరి కింద రూ.3 లక్షల వరకు రుణం, 60 శాతం రాయితీ లభిస్తుందని స్పష్టం చేశారు. ఒకేసారి దాదాపు 5 లక్షల మంది యువతకు పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ వీప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.

Deputy CM Spoke In Rajiv Yuva Vikasam Scheme Inauguration