calender_icon.png 22 September, 2024 | 5:09 PM

విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం

22-09-2024 12:00:00 AM

  1. అధికారుల బృందంతో అమెరికా, జపాన్ టూర్
  2. పెట్టుబడుల కోసం పలు సంస్థలతో సమావేశం
  3. అక్టోబర్ 4న హైదరాబాద్‌కు తిరుగు పయనం

హైదరాబాద్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో అధికారుల బృందం శనివారం విదేశీ పర్యటనకు వెళ్లింది. అక్టోబర్ 4వరకు అమెరికా, జపాన్ దేశాల్లో డిప్యూటీ సీఎం పర్యటించనున్నారు. రెండు దేశాల పర్యటనలో భాగంగా మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎక్స్‌పోలతో పాటు, ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాల సందర్శించనున్నారు. అధికారుల బృందం మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఆధునిక పద్ధతులు, లోతైన అధ్యయనం చేయనుంది. 

24న మైనింగ్ ఎక్స్‌పోలో. 

తొలుత డిప్యూటీ సీఎం, అధికారుల బృందం అమెరికాకు చేరుకోనుంది. ఈనెల 24, 25 తేదీల్లో అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్‌పోలో పాల్గొంటారు. అక్కడ వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. తదుపరి హోవర్ డ్యామ్‌ను సందర్శిస్తారు. 26న లాస్ట్‌ఏంజెల్స్‌కు చేరుకుంటారు. 27న ఎడ్వర్డ్స్ అండ్ సాన్‌బోర్న్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ విధానాన్ని డిప్యూటీ సీఎం భట్టి, అధికారులు పరిశీలిస్తారు. 28న పెట్టుబడిదారులు, సాం కేతిక నిపుణులతో సమావేశం కానున్నారు. 

29న జపాన్‌కు..

29న జపాన్ దేశంలోని టోక్యోకు డిప్యూటీ సీఎం భట్టి, అధికారులు చేరుకుంటారు. 30న స్థానిక దౌత్యవేత్త ఏర్పాటుచేసిన డిన్నర్‌లో పాల్గొంటారు. అక్కడ పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. అక్టోబర్ 1న పెట్టుబడిదారులతో వ్యక్తిగతంగా (వన్ టు వన్) సమావేశం అవుతారు. అనంతరం యామ న్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సందర్శిస్తారు. అక్టోబర్ 2న తోషిబా, కవాసకి, ఓకాసా ప్రధాన కార్యాలయాలకు వెళ్తారు. అక్టోబర్ 3న పానాసోనిక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు. అక్టోబర్ 4న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. అధికారుల బృందంలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ ఉన్నారు.