21-02-2025 11:00:30 PM
డిప్యూటీ సీఎం షిండే...
ముంబై: మహాలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని వార్తలు వినిపిస్తున్న తరుణంలో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల కాలంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏర్పాటు చేసిన సమావేశాలకు షిండే డుమ్మా కొడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. షిండే సీఎంగా ఉన్న సమయంలో రూ. 900 కోట్లతో జలానా ఏరియాలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టును ప్రస్తుతం ఫడ్నవీస్ ప్రభుత్వం హోల్డ్‌లో ఉంచింది. అంతే కాకుండా ప్రాజెక్టుపై విచారణకు కూడా ఆదేశించింది. దాంతో షిండే కాస్త గుర్రుగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను సాధారణ పార్టీ కార్యకర్తను. అలాగే బాలాసాహెబ్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తిని. ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. నేను 2022లోనే ప్రభుత్వాన్ని పడగొట్టాను. ఈ వ్యాఖ్యలు అర్థం కావాల్సిన వారికి అర్థమయితే చాలు’. అని అన్నారు. 2022 సమయంలో ఏక్‌నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగరేసి అధికారంలో ఉన్న శివసేనకు భారీ షాక్ ఇచ్చారు. షిండే దెబ్బతో ఆనాడు ప్రభుత్వం పడిపోయింది. బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మొన్నటి ఎన్నికల్లో ఆయన బీజేపీతో కలిసి మహాయుతి కూటమిలో భాగంగా పోటీ చేశారు. ఏక్‌నాథ్ షిండే శివసేనకు 57 మంది ఎమ్మల్యేలు ఉన్నారు.
దూరం పెరుగుతోందా???
ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు, మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఫడ్నవీస్ నిర్వహిస్తున్న చాలా సమావేశాలకు షిండే హాజరుకావడం లేదు. ఆయన కూటమి నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది ఎమ్మెల్యేలు కావాలి. కాగా మహాయుతి కూటమిలోని షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు ఉన్నాయి. కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి 132 సీట్లున్నాయి. షిండే తన మద్దతును విరమించుకున్నా ఇప్పటికిప్పుడు కూటమికి వచ్చిన ఢోకా ఏమీ లేదు కానీ తర్వాత అజిత్ పవార్ మీద ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. షిండే సీఎం సమావేశాలకు డుమ్మా కొట్టడమే కాకుండా సచివాలయంలో కూడా ఈ రెండు పార్టీలు సొంతంగా వైద్య సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ఈ పోరు మరింత అధికమైంది. ‘చీఫ్ మినిస్టర్‌తో ఎటువంటి కోల్డ్ వార్ లేదు. మేము ఐక్యంగానే ఉన్నాం. మహా అభివృద్ధిని అడ్డుకునే వారితోనే మా పోరాటం’. అని ఇటీవల పేర్కొన్నారు.