ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నాగర్ కర్నూల్(విజయక్రాంతి): ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచేందుకు ఏడాదిలో లక్ష కోట్లు అయినా ఖర్చు చేసేందుకు వెనకాడేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభాలు చేశారు. ఇమ్మానిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన 33/11 కేవి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సొంత జిల్లా అయిన పాలమూరును అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు ఏడాది కాలంలో లక్ష కోట్లకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
గత పదేళ్ల కాలం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru Ranga Reddy Project) నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు వెనకబడిందని దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంలోను అలసత్వం వహించిందన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు. భూగర్భంలో నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలోనే రైతులు వ్యవసాయం మీద ఆధారపడుతున్న నేపద్యంలో వోల్టేజీని అధిగమించడం కోసమే నూతన సబ్స్టేషన్లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడి సాయం పెంచి ఇస్తున్నామన్నారు.
దళారుల బారిన పడకుండా నేరుగా ట్రాన్స్ఫార్మర్స్ ఇస్తున్నామన్నారు. విద్యుత్ సమస్యలపై నేరుగా ఫిర్యాదు కోసం1912 టోల్ ఫ్రీ అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఏడాదిలోనే అమలు చేస్తున్నామన్నారు. 11వందల కోట్లు విద్యుత్ శాఖ బకాయిలు(Dues of Electricity Department) కడుతున్నామన్నారు. 200 యూనిట్ వారికి మార్చి నుండి ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్, రైతు భరోసా పథకం 12వేలు ఏడాదికి రెండు పంటలకు, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద జనవరి 26నుండి 12వేలు ఇస్తున్నామన్నారు. పంట నష్ట పరిహారం, ఇన్సూరెన్స్ కూడా చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూ నిర్వాసితులకు పరిహారాన్నీ ప్రయారిటీ ప్రకారం పెంచుతామన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు(Indiramma houses) అర్హతగల వారికి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇస్తున్నామన్నారు. మహిళలు స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలు, సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో మహిళలకే మొదటి ప్రాధాన్యతగా ఇస్తున్నామన్నారు. వారితో పాటు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, అబ్దుల్లా కొత్వాల్, సిఎండి ముషారఫ్ అలీ, సిఈ బాలస్వామి, ఎస్ఈ పాల్ రాజ్, డిఈఈ శ్రీధర్ శెట్టి, ట్రాన్స్కో ఏఈ మాధవి, ఏఈ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.