హైదరాబాద్,(విజయక్రాంతి): రైతు భరోసా(Rythu Bharosa)పై ఎంతో దుష్ప్రచారం చేశారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆదివారం పేర్కొన్నారు. జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా పంపిణీ చేస్తున్నట్లు భట్టి హామీ ఇచ్చారు. రైతులు సాగు చేస్తున్న భూమికి రైతుభరోసా ఇస్తామన్నాం, ఇస్తాం అన్నారు. అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్లపాటు మోసపోయామని భట్టి విక్రమార్క వెల్లడించారు.
గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసిందని, మాజీ సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు రూ.2 లక్షలలోపు ఉన్న రుణాలను ఒకే విడతలో మాఫీ చేశామని, ఇప్పటికీ ఏమైనా కారణాలతో ఎవరికైనా వర్తించకపోతే పూర్తి చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేదని, ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదే 56 వేల ఉద్యోగాలు ఇచ్చిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.