హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పార్టీని వ్యతిరేకిస్తూ జార్ఖండ్ ప్రజలు ఇండియా కూటమికే పట్టం కట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం రాంచీలోని హోటల్ చాణక్యలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొని వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమను గెలిపించిన ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం అదృష్టమని.. దేశాన్ని వలస పాలన నుంచి విముక్తి చేసింది ఈ పార్టీయేనన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ ఇంచార్జ్ సిరివెళ్ల ప్రసాద్, ఏఐసీసీ సెక్రటరీ గులాం అహ్మద్‌మీర్, పార్టీ సీనియర్ పరిశీలకుడు, పీసీసీ ప్రెసిడెంట్ కేశవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.