హైదరాబాద్: రుణమాఫీ నేపథ్యంలో ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం గురువారం ప్రారంభమైంది. రైతు రుణమాఫీ పై ప్రజాభవన్లో బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను పంటరుణాల మాఫీకే వినియోగించాలన్నారు. ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లో జమ చేయవద్దని ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఆగస్టు నెల దాటకముందే 31 వేల కోట్లను రైతు రుణమాఫీ కింద విడుదల చేస్తామని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు 11 లక్షల పైబడి రైతులకు 6000 కోట్ల పైబడి నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఈ నెలలోనే రెండో దఫా లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతుల రుణాలకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఆ తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేస్తామన్నారు.
రెండు లక్షలపైన రుణం ఉన్న రైతుల తో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకొని.. ప్రభుత్వం మంజూరు చేసే రెండు లక్షలు కలుపుకొని ఏ రైతు రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా, 31 వేల కోట్లు ఏ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చే ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా నేను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డు పై సంతకం చేసి ప్రచారంలోకి వెళ్ళామని గుర్తుచేశారు. ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉన్నాం.. తూచా తప్పకుండా రైతు రుణమాఫీని అమలు చేసి చూపిస్తున్నాని వ్యాఖ్యానించారు.
40 లక్షల బ్యాంకు అకౌంట్లో ద్వారా 31 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అన్నారు. కార్పొరేట్ బ్యాంకింగ్ సెక్టర్ లోనూ ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రికవరీ కాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహమన్న భట్టి విక్రమార్క ఈరోజు రైతులు ఎలాగా పండుగ చేసుకుంటున్నారో.. బ్యాంకర్లు కూడా అదే విధంగా పండుగ చేసుకోవాలని చమత్కరించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందన్నారు.
ఈ రాష్ట్ర జిఎస్ జిడిపిలో 16.5% వ్యవసాయ రంగం నుంచి వస్తుంది, రాష్ట్రంలో 45% పైబడి ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని.. భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు.. లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ నేపథ్యంలో బ్యాంకుల వద్ద అధికారులు ఉత్సవాలు జరుపుకోండి.. విస్తృతంగా ప్రచారం చేయండని ఢిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొన్నారు.