calender_icon.png 9 October, 2024 | 9:57 PM

కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం

09-10-2024 07:11:34 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఎల్బీ స్టేడియంలో టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. టీచర్లకు నియామకపత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 11,062 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం  కేవలం ఏడు నెలల్లోనే మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసింది. సుమారు 2 లక్షల 46 వేల మంది  అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోకుండా మొత్తం ప్రక్రియ పూర్తి చేసింది. స్కూల్ అసిస్టెంట్లు 2,515, భాషా పిండితులు 685, ఎస్జీటీ 6,277, పీఈటీ 145, స్పెషల్ ఎడ్యుకేటర్లు 103, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ 281 పోస్టులను భర్తీ చేసింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 761 మంది, పెద్దపల్లి జిల్లా నుంచి 82 మందికి నియామకపత్రాలు అందజేశారు. కోర్టు కేసులు, ఇతర సమస్యలతో 1056 పోస్టులు భర్తీ ప్రక్రియ పెండింగ్ ఉన్నాయి.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ... కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగిందని, ఉద్యోగాల భర్తీపై గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని భట్టి పేర్కొన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే తపనతో టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. పదోన్నతులు, బదిలీలు లేక ఏళ్ల తరబడి టీచర్లు ఇబ్బందులు పడ్డారు. ప్రతిపక్షం కుటిల ప్రయత్నాలు చేసినా.. డీఎస్సీ ప్రక్రియ ఆగలేదని భట్టి తెలిపారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తోన్న ఏకైక ప్రభుత్వం మాది అని డీప్యూటి సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.