calender_icon.png 24 September, 2024 | 1:53 AM

నేడు ఎస్‌ఎల్‌బీసీ సందర్శనకు డిప్యూటీ సీఎం, మంత్రులు

20-09-2024 12:00:00 AM

పనులు పరిశీలించునున్న భట్టి,ఉత్తమ్, కోమటిరెడ్డి

రెండేండ్లలో పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక 

పర్యటనలో భాగంగా అధికారులతో సమావేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని పూర్తి చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సందర్శించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్వహించిన పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే సొరంగాన్ని పూర్తి చేస్తామని భట్టి హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో భట్టి సమీక్షించారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సొరంగం వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి సందర్శనకు వెళ్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ 10 కిలోమీటర్ల మేర తవ్వాల్సిన  ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 80 శాతం పూర్తున ఈ ప్రాజెక్టుకు బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో కేవలం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగు నీరు, 512 గ్రామాలకు తాగునీరు అందేదని చెబుతోంది. కానీ ఆ నిధులు  కేటాయించకుండా వదిలేసిందని ఆరోపిస్తోంది. నిర్దేశించుకున్న రెండేళ్ల వ్యవధిలో సొరంగాన్ని పూర్తి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.