25 May, 2026 | 1:46 AM

గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు చెల్లింపు

25-05-2026 01:06 AM

పంట అవశేషాల దహనంపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలి: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ధాన్యం కొనుగోళ్లు, మహిళా సంక్షేమ వారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి

మహబూబాబాద్, మే 24 (విజయక్రాంతి): పంట అవశేషాల దహనంపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

ఆదివారం, ధాన్యం కొనుగోళ్లపై ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ పౌరసరఫరాల సంస్థ కార్యాలయం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ (సీతక్క), పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎస్పీ శబరిష్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ యాసంగి - 2026 ధాన్యం కొనుగోళ్లను అనేక సవాళ్ల మధ్య కూడా విజయవంతంగా నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది భారీ స్థాయిలో వరి దిగు బడి వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఇటీవల మంత్రివర్గం సన్ఫ్లవర్ పంట కొనుగోలుకు ఆమోదం తెలిపిందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. గతంలో రైతులకు ధాన్యం చెల్లింపులు నెలల తరబడి పెండింగ్లో ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వ పాలనలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మే చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు వంద శాతం పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

స్థానికంగా ఉండే హమాలీలు, రవాణా సమస్యల పరిష్కారానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ తరపున అవసరమైన ఖర్చుల ను రీయింబర్స్మెంట్ చేస్తామని తెలిపారు. వంద శాతం పెండింగ్ రైస్ డెలివరీ పూర్తి చేసిన డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి తీసుకొని, ధాన్యం కేటాయింపు చేయాలని మంత్రి పేర్కొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మంత్రివర్గం సన్ఫ్లవర్ కొనుగోలుకు ఆమోదం తెలిపిందని, అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు.

చివరి గింజ వరకు పంట కొనుగోలు జరిగేలా చూడాలని, వరి కొయ్యలను కాల్చకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ.. మహిళా సంక్షేమ వారోత్సవాలకు సంబంధించి మే 25న ఐఎంఎస్ భవనాలు, పోష ణ, అంగన్వాడీ కార్యక్రమాలు, మే 26న ఆర్టీ సీ బస్సులు, బాల్య వివాహాల నిరోధం, మే 27న సోలార్ ప్లాంట్లు, మహిళల భద్రతపై అవగాహన, మే 29న రుణ మేళా, జీవనోపాధి కార్యక్రమాలు, మే 30న ఉల్లాస్ సత్కారాలు, అంగన్వాడీ నమోదు కార్యక్రమాలను పండుగ వాతావరణంలో చేపట్టి, దిగ్విజ యం చేయాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు శాఖల వారీగా వివిధ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, ఈనెల 25న జిల్లాలో మంజూరైన 211 వీఓ బిల్డింగ్ ల మార్కింగ్ పూర్తిచేయాలని, అలాగే వాటి ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూ చించారు. అలాగే పోషక కిట్లు, అంగన్వాడీ కేంద్రాల ప్రారంభం, మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డుల వారీగా ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి చీరల పంపిణీ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలన్నారు.

ఈ నెల 26న ఆరు బస్సులను మండల సమాఖ్యలకు అందించే విధంగా ప్రారంభోత్సవాలు, ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలని తెలిపారు. మే 27న జిల్లాకు మంజూరైన రెండు సౌర విద్యుత్ యూనిట్ల ప్రారంభ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. బాలబాలికల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వ హించి, విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. మహిళల భద్రత, పోష్ చట్టం, సేవల పై ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించి, అవగాహన పెంచాలన్నారు.

మే 29న రుణ మేళా కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహిం చి, అర్హులైన వారికి రుణాలు అందించాలన్నారు. మే 30న అమ్మ మాట, అంగన్వాడీ బాట వంటి కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. అలాగే పది రోజుల్లో ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ పూర్తవ్వాలన్నారు. లారీల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, మిల్లుల వద్ద ప్రత్యేక దృష్టి సారించాలని, ఏ మిల్ దగ్గర ఎక్కువ దిగుమతికి లారీలు ఉన్నాయో అక్కడ  అధికారులు పర్యవేక్షణ చేసి, వెంటనే దిగుమతి అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.