calender_icon.png 24 October, 2024 | 2:46 AM

డిప్యూటేషన్ డీల్

24-10-2024 12:55:32 AM

  1. నిబంధనలు పట్టని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయం
  2. చేయి తడిపితే అడిగిన చోటుకు డిప్యూటేషన్?
  3. నగర శివారు ప్రాంతాలకు భలే డిమాండ్
  4. ఉద్యోగ సంఘాల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు

రంగారెడ్డి, అక్టోబర్ 2౩ (విజయక్రాంతి):  పైసలు, పైరవీలు ఉంటే చాలు మీరు కోరుకొన్న చోటికి చకచకా బదిలీ కావచ్చు. ఇక్కడ ఏ నిబంధనలు వర్తించవంటూ రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయం తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా లో ఉపాధ్యాయుల బదిలీలో  అక్రమాలు జరిగిన దూమారం మరువక ముందే..

డిప్యూటేషన్ల దందాకు అధికారులు తెరలేపారని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు బదిలీలు, డిప్యూటేషన్లు ఆన్ డ్యూటీ వంటి వాటిని పారదర్శకంగా నిర్వహించడానికి జూలై 24న ప్రత్యేక ఆదేశాలు జారీచేస్తూ ప్రత్యేక పోర్టల్‌ను అందులబాటులోకి తీసుకువచ్చింది.

ఐదుగురు సభ్యులతో ఇందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ అందులో పాఠశాల విద్యా కమిషనర్‌ను  సభ్యుడిగా నియమించింది. పోర్టల్ ద్వారా డిప్యూటే షన్లు తదితర వాటికి దరఖాస్తు చేసుకుంటే వివరాలకు అనుగుణంగా పారదర్శకంగా డిప్యూటేషన్లు జరుగుతాయని తొలుత ఉపాధ్యాయులంతా భావించారు. కానీ రంగారెడ్డి విద్యాశాఖ అధికారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రామీణ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొంతవరకు డిప్యూటేషన్లు చేసుకొనే వెసులుబాటు గతంలో ప్రభుత్వం కల్పించింది. అది కుడా కేవలం అదే మండలంలోని ఒక పాఠశాల నుంచి మరోపా ఠశాలకు మాత్రమే కల్పించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు చేపడుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు..

తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న శ్రీదేవిని అక్కడ విధుల్లో చేరిన వెంటనే మహేశ్వరం నియోజకవర్గం శివారు ప్రాంతంలోని సరూర్‌నగర్ బొమ్మనగండి ఎంపీయూఎస్‌కు రెండేళ్ల వరకు డిప్యూటేషన్ చేశారు. ఈ డిప్యూటేషన్ పై పెద్దఎత్తున దుమారం మరువక ముందే..

కడ్తాల, ఆమనగల్లు, కొండాపూర్ పాఠశాలల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యా యులను డిప్యూటేషన్లపై వారు కోరుకొన్న చోటుకి జిల్లా విద్యాధికారులు తాజాగా పంపించడం పట్ల ఉపాధ్యాయ వర్గాల్లో పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. చుక్కాపూర్ పాఠశాలలో ఐదు తరగతులకు గాను ప్రస్తుతం 65 మంది విద్యార్థులు ఉన్నారు.

తాజాగా మహేశ్వరం మండలంలో ఎస్జీటీగా పనిచేస్తున్న శ్రీదేవి పదోన్నతిపై కడ్తాల మండలంలోని రావిచేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా వెళ్లింది. అక్కడి నుంచి గతనెల 30న సరూర్‌నగర్ మండలంలోని కర్మన్‌ఘాట్ పాఠశాలకు డిప్యూటేషన్ పై వచ్చింది. దీంతో రావిచేడ్ పాఠశాలలో సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు పాఠాలకు దూరం అవుతున్నారు.

పెద్దల ఆశీర్వాదంతో..

ఎన్ మాలిని అనే ఎస్జీటీ ఉపాధ్యాయురాలు కొండాపూర్ స్కూల్‌లో పనిచేస్తూ సరూర్‌నగర్ ఎన్టీఆర్‌నగర్‌కు డిప్యూటేషన్‌పై వచ్చింది. కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 400కు పైగా విద్యార్థులు ఉన్నారు. ఆమనగల్లు బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పీడీ జ్యోతి పీడీ సంఘం పెద్దల ఆశీర్వాదంతో అబ్దుల్లాపుర్‌మెట్‌కు డిప్యూటేషన్‌పై వచ్చింది.

అయితే సరూర్‌నగర్ మండలంలోని మన్సూరాబాద్‌లో 350 మంది విద్యార్థులు ఉండగా అక్కడ 7 మంది ఉపాధ్యాయులకు గాను కేవలం నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్లు కేటాయించాల్సి వస్తే మన్సూరా బాద్‌కి వారిని పంపించాల్సి ఉంది కానీ అక్కడికి పంపించడం లేదు.

ఈ డిప్యూటేషన్ల వెనుక పెద్ద డీల్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి జిల్లాలో ఇటీవల జరిగిన డిప్యూటేషన్లపై జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తేనే అక్రమాలకు తెరపడుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంపై జిల్లా విధ్యాశాఖ అధికారి సుశీందర్‌రావును ఫోన్‌లో వివరాలు అడిగేందుకు సంప్రదించగా తన పరిధిలో డిప్యూటేషన్ల ఆర్డర్లు రావడం లేదని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు తెలిపారు.