calender_icon.png 22 October, 2024 | 4:10 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

22-10-2024 01:33:44 PM

విశాఖపట్నం,(విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తూర్పు మధ్య బంగాళాఖాతంలో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది.  అల్పపీడనంగా కేంద్రీకృతమై సాగర్ ద్వీపానికి (పశ్చిమ) దక్షిణ ఆగ్నేయంగా 770 కి.మీ దూరంలో ఉన్న పారాదీప్ కి ఆగ్నేయంగా 730 కి.మీ దూరంలో అదే ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బంగ్లాదేశ్  ఖేపుపరా కి దక్షిణ-ఆగ్నేయంగా 740 కి.మీ దూరంలో రేపటికి తుఫాన్ గా మారనుంది. 

వాయువ్య దిశగా కదులుతూ అక్టోబరు 24 నాటికి వాయువ్య బంగాళాఖాతం మీదుగా తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది, అక్టోబర్ 24, 25 తేదీల్లో పూరీ, సాగర్ ద్వీపం మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. 120 కిలోమీటర్ల వేగంతో 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది.

తుఫాన్ నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.