హైదరాబాద్, నవంబర్ 1: ధనతెరాస్, దీపావళి పర్వదినాలు ముగియగానే బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర తగ్గిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 770 మేర తగ్గి రూ.80,560 వద్దకు చేరింది. అయితే ఇది దీపావళి రోజైన గురువారం రూ.81,330 వద్ద ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది.
తాజాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.700 తగ్గుదలతో 7,385 వద్ద నిలిచింది. శుక్రవారం రాత్రి ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర 2,753 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. ఇది అక్టోబర్ 30న 2,790 డాలర్ల రికార్డుస్థాయికి చేరిన తర్వాత వరుస రెండు రోజుల్లో 35 డాలర్లకుపైగా తగ్గింది. ఈ ప్రభావంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం శుక్రవారం రాత్రి రూ. 78,600 వద్దకు చేరింది.
రూ.3 వేలు తగ్గిన వెండి
ప్రపంచ మార్కెట్లో భారీగా తగ్గిన కారణంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 3,000 మేర తగ్గి రూ.1,06,000 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 3 శాతం మేర క్షీణించి 32.75 డాలర్ల వద్దకు పడిపోయింది.