calender_icon.png 27 October, 2024 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేగంపేట పోస్టాఫీసులో డిపాజిట్లు మాయం

27-10-2024 01:30:23 AM

  1. నకిలీ పాస్‌బుక్స్‌తో రూ.30 లక్షలు కాజేత
  2. సబ్ పోస్ట్‌మాస్టర్ చేతివాటంగా అనుమానం

పెద్దపల్లి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట తపాలా శాఖలో డిపాజిట్లు గల్లంతైన ఘటన వెలుగుచూసింది. పోస్టాఫీసులో సబ్ పోస్ట్‌మాస్టర్‌గా పని చేస్తున్న హేమ చేతివాటంగా విచారణలో బయటపడగా, సెంటినరీకాలనీ పోస్టాఫీసులో పనిచేసే మరో సబ్ పోస్ట్‌మాస్టర్ నరేంద్రచారి హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై అధికారులు శనివారం పోస్టాఫీసుకు చేరుకొని విచారణ చేపడుతుండగా, ఖాతాదారులు చేరుకొని ఆందోళన చేశారు. దీనితో సబ్ డివిజన్ పోస్టల్ అధికారి మోహన్.. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. సబ్ పోస్ట్‌మాస్టర్ హేమను ప్రశ్నించారు. ఖాతాదారులు సంయమనం పాటించాలని, గల్లంతైన సొమ్మును రికవరీ చేస్తామని అధికారులు చెప్తున్నారు. కాగా.

ఈ నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయడంలో ఎవరెవరి హస్తం ఉందోనన్న విషయాలు బయటకు రావాల్సి ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ పోస్ట్‌మాస్టర్ హేమను వివరణ అడగగా, తనకేమీ తెలియదనీ, సబ్ పోస్ట్‌మాస్టర్ నరేంద్రచారి ఇదంతా చేశాడనీ, తనకు నకిలీ పాస్ పుస్తకాలు పంపిస్తే సంతకాలు చేశానని చెప్తున్నారు.

తనకు కొద్ది రోజులు గడువు ఇస్తే ఆ సొమ్మును తిరిగి ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తానని చెప్పడం గమనార్హం. మహిళా పోస్ట్‌మాస్టర్ హేమ చేతివాటం వల్లనే ఇదంతా జరిగిందని విచారణలో వెల్లడైనట్టు అధికారి మోహన్ తెలిపారు. ఇదిలా ఉండగా సెంటినరీకాలనీ, బేగంపేట పోస్టాఫీసులలో ఇంకా డిపాజిట్లు గల్లంతై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.