కామారెడ్డి (విజయక్రాంతి): నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో నిర్వహించిన గ్రామసభల్లో అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందట్లేదని మండిపడుతున్నారు. సదాశివనగర్ మండలం ఉత్తునూర్, రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో అధికారులను గ్రామస్థులు చుట్టుముట్టారు. రూ.30వేల రుణం ఉన్నా.. మాఫీ కాలేదని అధికారులను ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, తులం బంగారం రుణమాఫీపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటుతున్నా పథకాలు ఎందుకు అమలు కావట్లేదని నిలదీశారు. దరఖాస్తులు ఇవ్వాలని అధికారుల సూచించగా.. ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారని అసహనం వ్యక్తం చేశారు. పలువురు దరఖాస్తు చేయకుండానే వెనుదిరిగి వెళ్లారు.