calender_icon.png 20 October, 2024 | 7:01 AM

డిపాజిట్ కేంద్రాలే అతడి టార్గెట్

20-10-2024 02:13:55 AM


* యూపీఐ పేమెంట్ చేస్తానంటూ మొదట డిపాజిట్ కేంద్రాలే అతడి టార్గెట్ 

* ముందే జరిపిన లావాదేవీ స్క్రీన్‌షాట్‌తో బురిడీ 

* పోలీసులను ఆశ్రయించిన బాధితులు

* నిందితుడి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : ఆన్‌లైన్ బెట్టింగ్‌లకి బానిసైన ఓ పట్టభద్రుడు ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీ ఈస్ట్ గోదావరికి చెందిన ఇంటిపెల్లి రామారావు (30) బీటెక్ చదివాడు. హైదరబాద్‌లో నివాసం ఉంటూ గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తూ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. వచ్చే జీతం సరిపోక నేరాలు చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఎస్బీఐ నగదు డిపాజిట్ కేంద్రాలను టార్గెట్ చేశాడు. అక్కడికి నగదు జమ చేయడానికి వచ్చే బాధితులతో మాటలు కలిపి..  తన ఏటీఎం కార్డుతో విత్‌డ్రా చేయడం వీలు కావడం లేదంటూ తనకు అత్యవసరంగా నగదు అవసరమని వారితో చెప్తాడు. వారికి ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేస్తానని నమ్మిస్తాడు.

అలా డబ్బు తన చేతికి అందగానే తన ఫోన్‌లో ముందుగానే రూపొందించి పెట్టుకున్న సందేశాన్ని వారికి చూపించి.. తన ఖాతాలో డబ్బు డెబిట్ అయిపోయిందని.. 1 గంటల్లో మీ ఖాతాల్లో జమ అవుతుందని నమ్మిస్తాడు. అతడి మాటలు నమ్మిన బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఇలా మోసపోయిన పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందాలతో ఫోన్ నంబర్ ఆధారంగా రామారావు అచూకీ తెలుసుకొని శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.5.16 లక్షల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితు డిపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 55 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో 9 కేసులు హైదరాబాద్‌లోని పలు స్టేషన్లలో నమోదైనట్లు వెల్లడించారు.