calender_icon.png 17 October, 2024 | 7:35 PM

సస్పెండ్ కు కుట్రలు చేస్తున్న డీఈఓ రోహిణి

17-10-2024 05:26:00 PM

కలెక్టర్ విచారణ చేపట్టి న్యాయం చేయాలి

ముషీరాబాద్, (విజయక్రాంతి): హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ రోస్టర్ పాయింట్లో అక్రమాలు జరిపి తనకు రావలసిన ప్రమోషన్ ను అక్రమంగా అడ్డుకోవడమే కాకుండా తనను సస్పెండ్ చేయడానికి కుట్రలు చేస్తున్న హైదరాబాద్ డీఈఓ ఆర్.రోహిణితో పాటు ఎంఈవో ఎండీ ముస్తఫాలపై హైదరాబాద్ కలెక్టర్ విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని దివ్యాంగుడు, ఎస్జీటీ టీచర్ బూర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. న్యాయం చేయకపోతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను అసిఫ్ నగర్ లోని సీసీ నగర్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఇంగ్లీష్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు.

తనకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ విషయంలో ఉన్నతాధికారులు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తన ప్రమోషన్ విషయంలో హైకోర్టుని ఆశ్రయించానని, కోర్టు పదోన్నతి ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. డీఈఓ రోహిని అవినీతిపై గతంలో తాను లోకాయుక్తలో ఫిర్యాదు చేసినందుకు కక్షగట్టి తనను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. కలెక్టర్ వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్.సాంబయ్య పాల్గొన్నారు.