calender_icon.png 11 January, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయపెడుతున్న డెంగ్యూ

02-01-2025 02:37:26 AM

  • మూడు రోజుల క్రితం ఒకరు మృతి
  • డెంగ్యూ బారిన పడ్డ మరికొందరు 

 కోనరావుపేట, జనవరి 1:  కొద్ది రోజులుగా ఆ కాలనీ వాసులను డెంగ్యూ భయపెడుతుంది. మూడు రోజుల క్రితం డెంగ్యూ వ్యాధి బారిన పడి ఒకరు మృతి విషయం తెలిసిందే.  దీంతో ఆ కాలనీలో వ్యాధి బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ,విష జ్వరాలతో బాధపడుతున్న ఆ కాలనీ వైపు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోనరావుపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న కాలనీలో డెంగ్యూ, విషజ్వరాలతో బాధలు పడుతున్నారు. కాగా మూడు రోజుల క్రితం ఆ కాలనీకి చెందిన లోకుర్తి లచ్చయ్య డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు. లచ్చయ్య మనవడు భవదీప్ (8) అనే బాలునికి సిరిసిల్లలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అదేవిధంగా కొడుకు రిషి వర్ధన్ (12) జ్వరంతో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చాడు. బోయిన రాజు విష జ్వరం రావడంతో  కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బోయిన కాశయ్య కొడుకు వరుణ్ ఇటీవలే జ్వరంతో బాధపడుతూ చికిత్స తీసుకొని ఇంటికి వచ్చాడు. అపూర్వ అనే బాలిక కూడా విష జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది.

ఇలా ఒకే కాలనీకి చెందిన పలువురికి జ్వరం డెంగ్యూ సోకడంతో ఆ కుటుంబాలు భయాందోళనలకు గురైతున్నాయి. ఆ కాలనీలో పారిశుద్యం లోపించడంతోనే విష జ్వరాలు ప్రబలుతున్నాయని ఆ కాలనీవాసులు ఆరోపిస్తు న్నారు. అంతేకాకుండా జ్వరాల బారిన పడిన తమకు వైద్య సేవలు అందించేందుకు ఇటువైపు సిబ్బంది కన్నెత్తి చూడడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి మెరుగైన సేవలు అందించాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు.