02-09-2024 02:58:20 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో డెంగ్యూతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాము అప్రమత్తంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నా, పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడం లేదు. దీంతో డెంగ్యూ బాధితులు ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తూ రూ.లక్షల్లో ఖర్చు పెడుతున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆగస్టు 30 నాటికి రాష్ట్రంలో 1,06,356 మందికి డెంగ్యూ పరీక్షలు చేయగా, 6,242 కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ పాజిటివిటీ రేటు 6 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై పలు చర్యలు చేపట్టింది. డీహెచ్ కార్యాలయంలో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు కసరత్తు చేశారు. వివిధ వైద్య విభాగాధిపతులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, పరిస్థితులను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు.
రాజధానిలో ఇలా..
రాష్ర్టంలో ఆగస్టు 30 నాటికి తీసుకున్న 3,127 చికున్ గున్యా నమూనాల్లో 167 కేసులు (5 శాతం) నమోదయ్యాయి. ఇందులో అత్యధిక కేసులు రాజధానిలోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 74, మహబూబ్‌నగర్ 20, వనపర్తి 17, రంగారెడ్డి 16, మేడ్చల్ 11 చొప్పున కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. 22,80,500 మలేరియా పరీక్షలు చేయగా.. 197 కేసులు (0.01శాతం) నమోదయ్యాయి. రాష్ర్టంలో ఫీవర్ సర్వే ద్వారా ఇప్పటి వరకు వైద్య బృందాలు 1,68,42,891 ఇండ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహించాయి. 5,17,19,839 మందికి టెస్టులు చేయగా 2,99,708 మందికి ఫీవర్ ఉన్నట్లు తేలిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
జిల్లాల వారీగా డెంగ్యూ కేసులు
జిల్లా నమోదైన కేసులు
హైదరాబాద్ 2,073
సూర్యాపేట 506
మేడ్చల్ మల్కాజిగిరి 475
ఖమ్మం 407
నిజామాబాద్ 362
నల్లగొండ 351
రంగారెడ్డి 260
జగిత్యాల 209
సంగారెడ్డి 198
వరంగల్ 128