- ఆదిభట్లలో జోరుగా అక్రమ కట్టడాలు
- ఫిర్యాదులపై అధికారుల నామమాత్ర స్పందన
- బిల్డింగ్‌కు రూ.3లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు
- మున్సిపల్ అధికారులపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఇబ్రహీంపట్నం, నవంబర్ 23 : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సి పాలిటీలో అక్రమ నిర్మాణాల పరంపర కొనసాగుతోంది. అక్రమ కట్టడాలపై ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై అధికారులు నామమాత్ర నామమాత్ర చర్యలు తీసుకొని, తర్వాత అమ్యామ్యాలు అందడంతో కన్నెత్తి చూడకపోవడంతో నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఆదిభట్ల టాటా కంపెనీ ఎదురుగా అనుమతులకు మించి భవనాలను నిర్మిస్తున్నారు. నిర్మాణదారుల నుంచి మున్సిపల్ అధికారులు ఒక్కో బిల్డింగ్‌కు రూ.3 నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వారా మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయమై ఫిర్యాదులు అందడదంతో ఈ నెల 12న టౌన్ ప్లానింగ్ అధికారి ఓ నాలుగు భవనాలను ఆగమేగాల మీద తాత్కాలికంగా కూల్చివేతలు చేపట్టారు. కాగా మరుసటి రోజే అక్రమ భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్ అధికారుల తీరు మారడం లేదని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అడిగినంత ఇచ్చాం..
ఆదిభట్లలో అక్రమ నిర్మాణాల కూల్చేవేత సందర్భంగా కొందరు బిల్డర్లు టౌన్ ప్లానింగ్ అధికారిని అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారులు అడిగినంత డబ్బులు ముట్టజెప్పామని, అయినా ఎందుకు కూలుస్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో తెల్లమొహం పెట్టడం సదరు అధికారి వంతైంది. మరికొన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వడం ఎవరికి డబ్బులిచ్చారో వారినే అడగండంటూ సదరు టౌన్‌ప్లానింగ్ అధికారి సమాధానమిచ్చారు.
ఉన్నతాధికారులు స్పందించాలి
జీ+2 వరకే అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. బిల్డర్లతో కుమ్మకై అధిక మొత్తంలో ముడుపులు అందుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ, మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతు న్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
కోరె జంగయ్య,
ఆదిభట్ల మున్సిపాలిటీ