calender_icon.png 22 December, 2024 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటీసులివ్వకుండా కూల్చేస్తారా?

14-09-2024 01:05:00 AM

  1. జీవో 99 జారీపై వివరణ ఇవ్వండి
  2. హైడ్రాకు హైకోర్టు ప్రశ్న 
  3. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని హైడ్రాను శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. ఇతర శాఖలు అనుమతులు మంజూరుచేసిన తరువాత ఎలాంటి వివరణ కోరకుండా, నోటీసులు ఇవ్వకుండా ఏ అధికారంతో కూల్చివేస్తారని ప్రశ్నించింది. హైడ్రాను ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీవో 99ను చట్టబద్ధతపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

జీవో 99 చట్టబద్ధతను సవాలుచేస్తూ హైదరాబాద్ నానక్‌రాంగూడకు చెందిన డీ లక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పరిపాలనాపరమైన అధికారాలు చెల్లవన్నారు. జీవో 99 ద్వారా జీహెచ్‌ఎంసీ అధికారాలను హైడ్రాకు అప్పగించిందని, ఇది జీహెచ్‌ఎంసీ చట్టానికి విరుద్ధమన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారాల కింద హైడ్రా పనిచేయడం చెల్లదన్నారు. అఖిల భారత సర్వీసు ఉద్యోగి, కార్యదర్శి హోదాకంటే తక్కువకాని అధికారి హైడ్రాకు నేతృత్వం వహిస్తారని జీవోలో పేర్కొన్నప్పటికీ దానికి విరుద్ధంగా నాన్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహిస్తున్నారన్నారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో సర్వే నెం.119/21, 1199/22లో పిటిషనర్‌కు చెందిన 19.27 ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వ్యవసాయ పరికరాలు, కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాలను ఈనెల 3న హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేసిందన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి జీవో 99 చట్టబద్ధతపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు.