అనురాగ్ యూనివర్సిటీ కేసులో హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొర్రె ముల (వెంకటాపూర్) గ్రామంలోని నాదం చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్సిటీ లకు చెందిన నిర్మాణాల తొలగింపుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారుల కు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాల తొలగింపునకు ఆధారాలైన ప్రతిపత్రాన్ని యాజమాన్యానికి అంద జేసి వారి వివరణ తీసుకున్నాక చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఎఫ్టీఎల్, బఫర్జోన్ల ఆక్రమణల పేరుతో కూల్చివేత చర్యలు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ వినోద్‌కుమార్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి చెరువుకు సంబంధించిన సర్వే మ్యాప్‌ను అందజేశారు. 1951 కాస్రా పహాణీ ప్రకారం 61 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందన్నారు. పిటిషనర్లు ఇదే అభ్యర్థనతో గత వారం పిటిషన్ దాఖలు చేశారని, ఇప్పుడు మళ్లీ అనవసర ఆందోళనతో మరో పిటిషన్ దాఖలు చేశారన్నారు.
చట్టప్రకారమే ముందుకెళతామని, అన్ని పత్రాలను కాలేజీలకు అందజేసి వివరణ తీసుకున్నాకే చర్యలు చేపడతామన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పత్రాలు ఇచ్చిన తరువాత వాటిని పరిశీలించి వివరణ ఇవ్వడానికి కనీసం ఒక వారం అయినా గడువు ఇచ్చేలా ఆదేశాలివ్వాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ పిటిషనర్లు కూడా ఎలాంటి నిర్మాణాలు కొనసాగించకుండా చూడాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి అన్ని పత్రాలను పిటిషనర్లకు ఇచ్చి వివరణ తీసుకుని చట్టప్రకారం చర్యలు చేపడతామన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీని రికార్డు చేసి పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
లాయర్‌పై దాడిని ఖండించిన బార్
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): సంగారెడ్డిలో లాయర్ చైతన్యపై దాడిని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఖండించింది. ఓ కేసులో వాదనలు వినిపించిన చైతన్యపై వ్యతిరేకపక్షానికి చెందినవారు దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కే సునీల్‌గౌడ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలోని కౌన్సిల్ సభ్యులు శుక్రవారం అత్యవ సర సమావేశం నిర్వహించారు. లాయర్‌పై దాడిలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తూ సమా వేశంలో తీర్మానం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.