- బీఆర్‌ఎస్ నేత ఫంక్షన్ హాల్ నేలమట్టం
- నిన్న బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం..
- తాజాగా ఓ కార్పొరేటర్ ఫంక్షన్ హాలు
- వెలుగుల ఖనిలో వేడెక్కిన వాతావరణం
పెద్దపల్లి, నవంబర్ 5 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వాతావరణం వేడెక్కింది. గోదావరి ఖని బీఆర్‌ఎస్ నాయకుడు, 37వ డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేశ్‌కు చెందిన ఫంక్షన్ హాల్‌ను నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం కూల్చివేశారు.
గోదావరిఖని అడ్డగుంటపల్లి ఎన్టీఆర్ నగర్‌లో ఉన్న సిరి ఫంక్షన్‌హాలుకు మంగళవారం ఉదయం జేసీబీలతో చేరుకున్న టౌన్ ప్లానింగ్ అధికా రులకు ఫంక్షన్‌హాల్ యజమానికి మధ్య వాగ్వాదం జరిగింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు అక్కడకు చేరుకొని కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కలెక్టర్‌తో మాట్లాడి కొంత సమయం కావాలని అడిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కార్పొరేటర్ కుటుంబ సభ్యులు జేసీబీకి అడ్డుగా పడుకోవడంతో మహిళా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఫంక్షన్‌హాల్‌ను నేలమట్టం చేశారు.
ఫంక్షన్ హాలు నాలాపై నిర్మించారని, అనుమతి లేని కారణంగా నెల రోజుల క్రితం నోటీసులు జారీ చేసినా స్పందించని పక్షంలో కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేయాల్సి వచ్చిందని అదనపు కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు.
రాజకీయ కక్ష సాధింపే : మాజీ ఎమ్మెల్యే చందర్
నగర పాలక సంస్థ పరిధిలో మూడు ఫంక్షన్‌హాళ్లకు నోటీసులు జారీచేస్తే, కేవలం బీఆర్‌ఎస్ నేత హాలునే కూల్చివేయడం రాజకీయ కక్ష సాధింపేనని మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, భారీ మూ ల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
అదే చౌరస్తాలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం కూల్చిన మరుసటి రోజే తమ పార్టీకి చెందిన కార్పొరేటర్ ఫంక్షన్‌హాలుకు అన్ని అనుమతులున్నా కూల్చడం రెచ్చగొట్టే చర్య అన్నారు. అనుమతులు లేకపోతే సీజ్ చేయాలి.. జరిమానాలు విధించాలి కానీ, విధ్వంసం సృష్టించవద్దన్నారు. ఫంక్షన్‌హాల్ యజమాని రాజేశ్ మాట్లాడుతూ.. అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టంచేశారు.
మున్సిపల్ అధికారులు ఇచ్చిన నోటీసులకు సరైన పత్రాలు కూడా సమర్పించానని, తాను కాంగ్రెస్‌లో చేరలేదన్న కోపంతోనే కూల్చివేశారని ఆరోపించారు. కాగా, తాము చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నామని, కార్పొరేషన్ పరిధిలో నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తామని కమిషనర్ అరుణశ్రీ స్పష్టం చేశారు.