హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14/10లోని పీవీఆర్ సినీఫ్లెక్స్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తికి 1984 జూన్ 6న నాటి ప్రభుత్వం షేక్‌పేట మండలం, గ్రామంలోని సర్వే నంబర్ 403లో రూ.8,500 చొప్పున 20 గుంటల భూమిని కేటాయించింది.
ఆయనకు కేటాయించిన భూమిని ఏడాదిలోగా వినియోగించుకోవాలని, లేదంటే అలాట్‌మెంట్‌ను రద్దు చేస్తామని పేర్కొంది. చక్రవర్తి రికార్డింగ్, రీరికార్డింగ్ థియేటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ భూమిని ఇచ్చింది. ఆయనతో పాటు ప్రముఖ దర్శకుడు కే రాఘవేందర్‌రావు, నిర్మాత కే కృష్ణమోహన్‌రావు, దర్శక నిర్మాత ఎంఎస్‌రెడ్డిలకు కూడా ఒక్కొక్కరికి 20 గుంటల చొప్పున రికార్డింగ్ స్టూడియోలు, సినిమా థియేటర్ల కోసం కేటాయించింది.
కాగా, అనుకున్న సమయానికి చక్రవర్తి రికార్డింగ్ థియేటర్‌ను ఏర్పాటు చేయలేకపో యారు. తర్వాత ఆయన కుమారుడు శ్రీనివాస్ చక్రవర్తి కూడా స్థలాన్ని వినియోగంలోకి తీసుకోకుండానే చనిపోయారు. దీంతో పాటు వారి కుటుంబంలో విబేధాల కారణంగా ఆ స్థలం ఖాళీగా ఉండిపోయింది. దీంతో స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ భూమేనని లాండ్ బ్యాంకులో నమోదు చేశారు.
దాదాపు రూ.65 కోట్ల విలువైన ఆ భూమిపై పలువురు అక్రమార్కుల కన్ను పడింది. ఇదే క్రమంలో నకిలీ దస్తావేజులు సృష్టించి పలువురు ఆ స్థలంలో అనుమతి లేకుండా చిన్న చిన్న షాపుల కోసం షెడ్లను ఏర్పాటు చేశారు. దీనిపై షేక్‌పేట్ ఎమ్మార్వో అనితారెడ్డికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అక్రమ నిర్మాణాలను కూల్చేసి అది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు.