శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాయదుర్గంలో ఉన్న లిడ్‌క్యాప్ భూముల్లోని అక్రమ నిర్మాణాలను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. రాయదుర్గంలోని సర్వేనంబర్ 2, 3, 4, 5లో గల లిడ్‌క్యాప్‌నకు చెందిన స్థలాలు కొన్నేండ్లుగా ఆక్రమణలకు గురయ్యాయి. ఈ భూముల్లో పలువురు అక్రమ నిర్మాణాలను చేపట్టారు. నగరంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇటీవల హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో లిడ్ క్యాప్ వారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాయదుర్గం సీఐ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కూల్చివేతల్లో ఆర్‌ఐ రాంబాబు, లిడ్‌క్యాప్ అధికారులు పాల్గొన్నారు. అయితే 40 ఏండ్లుగా తాము ఈ స్థలాల్లోనే నివాసముంటున్నట్లు స్థానికులు వాపోయారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.