30-01-2025 12:00:00 AM
ఎన్నెస్పీ స్థలంలోని ఇండ్లు నేలమట్టం
అన్యాయం చేశారని బాధితుల ఆవేదన
నాగార్జున సాగ ర్, జనవరి 29 : నల్లగొండ జిల్లా నిడమనూరు మం డల కేంద్రంలోని ఎన్నెస్పీ క్యాంపు స్థలంలో అక్రమ ని ర్మాణాలను బుధ వారం అధికారులు కూల్చేశారు. సర్వే నెంబర్ 230లోని 32 గుంటల ఎన్నెస్పీ స్థలాన్ని 2016లో కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల భవనం నిర్మాణం పూర్తి కావడంతో ఆవరణలోని అక్రమ నిర్మాణాల తొలగింపునకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఆదేశాలిచ్చారు.
దీంతో తెల్లవారుజామున తహసీల్లార్ సిబ్బందితో కలిసి ఉప్పునూరి సాంబ య్య, గనిపల్లి కోటమ్మ, నాగిళ్ల ఎల్లమ్మకు చెందిన ఇండ్లను జేసీబీతో కూల్చివేశారు. గూడు లేకుండా కట్టుబట్టలతో తాము ఎక్కడికి వెళ్లాలని బాధితులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయ త్నం చేశారు. సామగ్రి కూడా తీసికెళ్లే అవకాశమివ్వకుండా ఇండ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల తీరును నిరసిస్తూ తహసీల్లార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జీఓ.59 కింద స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకొని, 25 శాతం ధర చెల్లించినా పట్టాలివ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు.
విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. ఇండ్లను ఖాళీ చేయాలని ఇటీవల మూడు సార్లు నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో కూల్చివేసినట్లు తెలిపారు. వీరి క్రమబద్ధీకరణ దరఖాస్తులు గతంలోనే తిరస్కరించినట్లు వెల్లడించారు.